తిరుమలలోని కర్ణాటక చారిటీస్ కు టీటీడీ లీజుకు ఇచ్చిన స్థలంలో నూతన వసతి సముదాయాల నిర్మించడానికి కర్ణాటక ప్రభుత్వం, టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. తిరుమలలోని 7.05 ఎకరాల భూమిని 50 సంవత్సరాల కాల పరిమితికి 2008 సంవత్సరంలో తితిదే కర్ణాటక ప్రభుత్వానికి లీజుకు ఇచ్చింది. ఈ ప్రాంతంలో నూతన వసతి సముదాయాల నిర్మాణం పనులు చేపట్టేందుకు తితిదే అనుమతి కోరుతూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక ప్లాన్ ను దేవస్థానానికి సమర్పించింది.
తిరుమలలో రూ. 200కోట్ల పెట్టుబడితో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 140 మంది భక్తులు ఉండటానికి వీలుండే 12 డార్మిటరీలు, 610 మంది ఉండే విధంగా 305 సింగిల్ రూమ్స్, 24 సూట్ రూములు తదితర సదుపాయాలన్నీ నిర్మించనున్నట్లు సమాచారం అందజేశారు. అయితే సుమారు 3,22,545 చదరపు అడుగుల స్థలంలో ఈ సదుపాయాల నిర్మాణం జరగనుందని ప్రభుత్వ ప్రకటనలో తెలియజేశారు.