రాష్ట్రంలో ముడిపడకుండా ఉన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం.. ఇప్పుడు గవర్నర్ పేషీకి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డను పొమ్మన కుండానే పెట్టిన పొగ అనంతరం.. మారిన అనూహ్య పరిణామాలతో విషయం హైకోర్టుకు వెళ్లడం.. తిరిగి నిమ్మగడ్డను నియమించాలని కోర్టు ఆదేశించడం తెలిసిందే. అయినప్పటికీ..తనను తన పోస్టులో నియమించలేదని పేర్కొంటూ.. మరోసారి నిమ్మగడ్డ హైకోర్టుకు వెళ్లడం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను నియమించే అధికారం తమకు లేదని, సో.. గవర్నర్ అధికారాన్ని తాము తీసుకోలేమని చెప్పారు.
దీంతో నేరుగా నిమ్మగడ్డ గవర్నర్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు నిమ్మగడ్డను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీటులో కూర్చోపెట్టే విషయం గవర్నర్ పేషీకి చేరింది. దీంతో తాజాగా నిమ్మగడ్డ విజయవాడకు వచ్చి.. గవర్నర్‌తో భేటీ అయ్యారు. దీంతో నిమ్మగడ్డను సమర్ధించేవారంతా కూడా ఇంకేముంది.. ఆయనకు తిరిగి అప్పాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చేస్తారు.. అని అనుకున్నారు. ఒకరకంగా ఈ ప్రకటన విడుదల అయితే.. వెంటనే ప్రెస్‌మీట్లు పెట్టేందుకు కూడా టీడీపీ నేతలు రెడీ అయ్యారు. కానీ, గవర్నర్ హరిచందన్ ఇక్కడేట్విస్ట్ ఇచ్చారు.
నిమ్మగడ్డతో దాదాపు అరగంటకు పైగా భేటీ అయిన గవర్నర్ హరిచందన్.. విషయాన్ని నెమ్మదిగా పరిశీలించి తేలుస్తానని చెప్పారు! దీంతో నిమ్మగడ్డ నీరసపడిపోయారని సమాచారం. నిజానికి అరగంట భేటీలో నిమ్మగడ్డ తన ఆవేదనను అంతా వివరించడంతోపాటు.. జగన్ సర్కారుపై తీవ్ర ఫిర్యాదులు కూడా చేశారని తెలిసింది. వీటన్నింటినీ సావకాశంగా ఆలకించిన గవర్నర్.. చూసి చెబుతానన్నారు.