జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరివాడిగా కాకుండా కొందరివాడిగా మిగిలిపోతున్నట్టే కనిపిస్తోంది. మూడు రాజధానుల అంశం ఏపీలో తీవ్రంగా రగులుతోంది. ఓ వైపు ఎమ్మెల్యేల రాజీనామా అంశం తనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం తెగ సతమతమైపోతున్నారు. పవన్ 13 జిల్లాలు ఉంటే కేవలం రాజధాజి జిల్లాలుగా ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాలపైనే ఫోకస్ పెట్టారట. అంటే ఏపీలో 13 జిల్లాలు ఉంటే పవన్‌కు కేవలం రెండు జిల్లాలు మాత్రమే కనిపించాయా ? మిగిలిన జిల్లాలు, ఆ ప్రాంతాల ప్రజలు పవన్‌కు అవసరం లేదా ? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
ఓ వైపు పవన్ బీజేపీతో కలిశాక ఎవరి స్టాండ్ ఏమిటో కూడా అర్థం కావడం లేదు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీలను ఒకే గాటాన కడుతోన్న పవన్ బీజేపీ, జనసేన మాత్రమే ఖచ్చితమైన పార్టీలని చెప్పుకుంటున్నాయి. ఇక పవన్ ఉబలాటపడుతున్నట్టు ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే పవన్‌కు పోటీ చేసి ఇప్పుడు అయినా ఎమ్మెల్యేగా గెలిచే దమ్ముందా ? అన్నది ప్రశ్నించుకుంటే పవన్‌కు అంత సీన్ లేదనే చెప్పాలి. బీజేపీతో కలిసినంత మాత్రాన తన బలం పెరిగిపోయినట్టు పవన్ భావిస్తున్నారను కోవాలేమో ? అన్న సెటైర్లు కూడా పవన్‌పై పడుతున్నాయి.
నిజం చెప్పాలంటే బీజేపీతో కలవకపోయి ఉంటేనే జనసేనకు కాసిన్ని ఓట్లు వస్తాయేమో గాని.. ఏపీకి తీరని అన్యాయం చేసిన బీజేపీతో జట్టుకట్టడంతోనే పవన్ పని అయిపోయిందనే చెప్పాలి. గత ఎన్నికల్లో పవన్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో నోటాతో పోటీపడ్డ బీజేపీ, నోటాని ఓడించిన జనసేన.. దొందూ దొందే అనిపించుకున్నాయి. చివరకు పవన్ పోటీ చేసిన రెండు చోట్లా కూడా ఓడిపోయాడు. ఇప్పుడు పవన్‌కు తానే ఎమ్మెల్యేగా గెలుస్తాడన్న నమ్మకం జనసైనికులకే లేదు.
తాను ఇకపై సినిమాలు చేయనని చెప్పిన పవన్.. డబ్బుల కోసమే మళ్లీ సినిమాలు చేస్తున్నట్టు చెప్పారు. తాను సీరియస్ పొలిటిషీయన్ను కాదని.. సీజనల్ పొలిటిషీయన్ను అని చెప్పకనే చెప్పిన పవన్ ఉప ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా.. బీజేపీ సపోర్ట్ ఉన్నా కూడా జనం మళ్లీ ఓడించడానికి సిద్ధంగానే ఉన్నారు.