ఏపీలో ఇప్పుడు రాజకీయం టీడీపీ వర్సెస్ వైసీపీ కాదు కులాల వారీగా చీలిపోయింది. సాధారణంగా రాజకీయాల్లో కులం ఉంటుంది కాని.. ఇప్పుడు ఏపీ రాజకీయాలు పరిశీలిస్తుంటే కులమే రాజకీయం అయిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కమ్మ పార్టీ అయినా రెడ్లకు మంచి ప్రయార్టీ ఉండేది. సీమ, నెల్లూరు జిల్లాల్లో రెడ్ల హవానే టీడీపీలో ఉండేది. ఇక వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా గుంటూరు, కృష్ణా లాంటి చోట్ల కమ్మ డామినేషనే ఉండేది. రాయపాటి, లగడపాటి, దగ్గుబాటి, పిన్నమనేని వెంకటేశ్వరరావు, గల్లా అరుణ లాంటి కమ్మ మంత్రులు ఉండేవారు. కమ్మ వర్గానికి చెందిన చంద్రబాబు సీఎంగా ఉన్నా టీడీపీలో రెడ్ల హవా మనం చూశాం.. ఇక రెడ్డి వర్గానికి చెందిన వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పైన చెప్పుకున్న కమ్మల హవా చూశాం.
ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కుల రాజకీయాల గోల ఎక్కువ అయిపోయింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతా కమ్మల హవాయే నడిచిందని.. చంద్రబాబు కమ్మలకే దోచిపెట్టారని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు ఎన్నికలకు ముందు జగన్ కమ్మలపై తీవ్ర విమర్శలు చేస్తూ మిగిలిన కులాలను కమ్మలకు వ్యతిరేకంగా మార్చడంలో చాలా వరకు సక్సెస్ అయ్యి అధికారంలోకి వచ్చారు. ఇక ఎన్నికలకు ముందు రెడ్లు అందరూ జగన్‌కు దగ్గరయ్యారు. ఇక ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక అంతా రెడ్లదే హవా నడుస్తోంది.
సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్‌లో అందరూ రెడ్లే ఉన్నారు. ఇక విప్, చీప్ విప్‌లు, కీలక ఆఫీసర్లను కూడా రెడ్లతోనే జగన్ నింపేశారు. యూనివర్సిటీ వీసీల నుంచి అన్ని జిల్లాల్లోనూ వీరిదే హవా ఉంది. జగన్ పార్టీలో ఏకంగా 50 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. లోక్‌సభ, రాజ్యసభలోనూ రెడ్లదే హవా ఉంది. ఇక నాడు చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఎలా అయితే కమ్మ ముద్ర వేశారో.. నేడు జగన్ కూడా అదే ఫార్ములాతో వెళుతూ రెడ్లకే ప్రయార్టీ ఇస్తున్నారని లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు నిత్యం విమర్శలు చేస్తున్నారు.
ఇక నాడు చంద్రబాబు కమ్మలకు దోచిపెట్టుకున్నారన్న విమర్శలు వచ్చినా గ్రామాల్లో పేద కమ్మలకు ఒరిగిందేమి లేదు.. ఇప్పుడు జగన్ అన్ని పదవులు, కాంట్రాక్టులు రెడ్లకే ఇస్తున్నా గ్రామాల్లో పేద రెడ్లకు ఒరిగిందేమి లేదు. నాడు పేద కమ్మల్లో మెజార్టీ కమ్మలు వైసీపీకి ఓట్లేశారు… ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే రేపు పేద రెడ్లలో మెజార్టీ రెడ్లు చంద్రబాబు వైపునకు తిరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు. ఏదేమైనా పై స్తాయిలో కుల రాజకీయం జరుగుతున్నా ఈ కులాల్లో సామాన్యులు, పేదలు మాత్రం సమిధులు అయిపోతున్నారు. మరి మన నాయకుల తీరు ఎప్పటకి మారుతుందో ? చూడాలి.