ఐపీఎల్ 2020 ఆరంభ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌తో అబుధాబిలో జరిగిన ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబైపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చెన్నై బ్యాట్స్‌మెన్ రాయుడు, శామ్ కుర్రాన్‌లు విజృంభించడంతో ముంబై విసిరిన 163 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సులభంగా సాధించగలిగింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో సౌరభ్ తివారీ (31 బంతుల్లో 42 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్సర్), క్వింటన్ డికాక్ (20 బంతుల్లో 33 పరుగులు, 5 ఫోర్లు)లు రాణించారు. చెన్నౌ బౌలర్లలో లుంగి ఎంగిడికి 3 వికెట్లు దక్కగా, దీపక్ చాహర్, రవీంద్ర జడేజాలు చెరో 2 వికెట్లు తీశారు. శామ్ కుర్రాన్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై ఆరంభంలో తడబడింది. అయినప్పటికీ అంబటి రాయుడు (48 బంతుల్లో 71 పరుగులు, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), డుప్లెసిస్ (44 బంతుల్లో 58 పరుగులు, 6 ఫోర్లు) లు రాణించడంతో చెన్నై టీం 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. చివర్లో శామ్ కుర్రాన్ 6 బంతుల్లోనే 1 ఫోర్, 2 సిక్సర్లతో 18 పరుగులు చేశాడు. దీంతో చెన్నై టీం సులభంగా లక్ష్యాన్ని ఛేదించగలిగింది. ఇక ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ ప్యాటిన్సస్, బుమ్రా, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్‌లకు తలా 1 వికెట్ దక్కింది.