హలో మీరు బీజేపీ లోకి వస్తారా ? గోదావరి కాపులకు బిజెపి ఫోన్లు ?

-

ఏపీలో బిజెపి ఆషామాషీగా రాజకీయాలు చేయడం లేదు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా బిజెపి వేగం పెంచింది. అన్ని విషయాల్లోనూ క్లారిటీగా రాజకీయాలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకు 1,2 సీట్లు వస్తే సరిపోతుందని భావించింది. కానీ ఇప్పుడు మాత్రం అధికారమే లక్ష్యంగా బిజెపి అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు ఏపీలో బలం పెంచుకునేందుకు కొద్ది రోజులుగా హడావుడి చేస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వం పై హిందుత్వ విమర్శలు చేసి, కాస్త బలం పొందుతున్నట్లుగానే కనిపించింది. ఇప్పుడు కుల రాజకీయాలకు తెర తీసినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో బలమైన సామజికవర్గంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని దగ్గరకి చేసుకోవాలని, ఆ సామాజిక వర్గ అండదండలు ఉంటే, అధికారం సులువుగా దొరుకుతుందని బిజెపి అంచనా వేస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక వ్యక్తులను, వివిధ పార్టీల నాయకులను ఆకర్షించే పనిలో బిజెపి నిమగ్నమైనట్లు గా తెలుస్తోంది.

ఈ మేరకు ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ముఖ్యమైన కాపు నాయకులకు బీజేపీ నుంచి ఫోన్లు వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతోంది. మీరు పార్టీలో చేరితే.. మీకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, కీలకమైన పదవులు ఇస్తామని, అన్ని రకాలుగా అండదండలు అందిస్తామని, కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది కాబట్టి మీ రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా ఉండదని, ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ రాజకీయాల్లో ఉన్న నాయకులకు, కులసంఘాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తులకు బీజేపీ నుంచి ఫోన్లు వెళ్లినట్లు ఇప్పుడు గోదావరి జిల్లాలో ప్రచారం జరుగుతోంది. అయితే కొంత మంది బీజేపీ ఆఫర్లకు సానుకూలంగా స్పందించినా, మరికొంతమంది మాత్రం పట్టించుకోనట్టుగానే వ్యవహరించారట.

అసలు బిజెపి ఈ రెండు జిల్లాలపై ఫోకస్ చేయడానికి ప్రధాన కారణం కాపు సామాజిక వర్గం ఈ రెండు జిల్లాల్లో ఎక్కువగా ఉండడంతో పాటు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ రెండు జిల్లాల్లోని సీట్లే ప్రధానం . మెజారిటీ ఈ రెండు జిల్లాల నుంచి ఉంటేనే.. ఈ రెండు జిల్లాల్లో ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపితే, ఆ పార్టీ అధికారం దక్కించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఇప్పుడు బిజెపి ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేసినట్లుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు ఉండడం, జనసేనకు ఈ రెండు జిల్లాల్లో లక్షలాది మంది అభిమానులు ఉండటం, కాపు సామాజికవర్గం అంతా పవన్ ను ఆరాధిస్తూ ఉండడం, ఇవన్నీ తమకు కలిసి వస్తాయని బిజెపి లెక్కలు వేస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ రెండు జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచినట్టుగా కనిపిస్తున్నారు. ఆయన కూడా గోదావరి జిల్లాకు చెందిన వారే కావడంతో తనకున్న పరిచయాల మేరకు ఆయన బిజెపిలో చేరికలను ప్రోత్సహించేందుకు, కాపు సామాజికవర్గం అండదండలు బీజేపీకి ఉండేలా చేసేందుకు గట్టిగానే కష్టపడుతున్నట్టు కనిపిస్తున్నారు.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news