దేశంలో ఎక్కడైనా రెండు వేరు వేరు కులాలకు, మతాలకు సంబంధించిన వారు ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకుంటే… వారిలో అబ్బాయిని చంపాలని చూస్తున్నారు ఆడపిల్ల తల్లితండ్రులు.. ఆ పని పక్కాగా ముగించేస్తున్నారు.. కన్న కూతిరిని విదవరాండ్రను చేస్తున్నారు! దీన్ని అత్యంత అందంగా, పెద్దరికంగా అర్థం ద్వనించేలా… మీడియా ఈ హత్యలను “పరువు హత్యలు”గా సంభోదిస్తుంది! ఇది తప్పంటున్నారు నేటి యువత!
తమకు ఇష్టంలేని వ్యక్తిని పెళ్లి చేసుకుందని, తమ కులం వారు కాదని.. అల్లుడిని చంపాలని పథకాలు రచిస్తున్నారు కొందరు తల్లితండ్రులు! అది కూతురుపై ప్రేమా లేక కులంపై ప్రేమా? దానికి వారు చెప్పే సమాధానం మాత్రం… కూతురిపై ప్రేమ అని!! కానీ… అది కూతురిపై ప్రేమ అస్సలే కాదు.. కేవలం కులంపై ప్రేమ, ధన మదంపై ప్రేమ అని క్లారిటీ ఇస్తున్నారు నేటి యువత!
గారాభంగా పెంచుకున్న కూతురు తల్లితండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందంటే… తల్లి తండ్రులకంటే ఆ యువకుడు అత్యధికంగా ప్రేమిస్తున్నాడని ఆమె భావించి ఉండాలి లేదా.. తన తండ్రి ఎంత బాగా చూసుకున్నారో, ఈ అబ్బాయి కూడా అలానే చూసుకుంటాడనే నమ్మకం అయినా కలిగి ఉండాలి! వీటిలో ఎలా చూసినా… ఆమెవైపు కరెక్టే అనిపించకమానదు!! దానికి కేవలం అల్లుడిని చంపడం ఒకటే పరిష్కారమని కొందరు మూర్ఖులు ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న!
ఒక ఆడపిల్లపై హత్యాచారం చేసినవారిని ఎన్ కౌంటర్ చేస్తున్న పోలీసులు, వాటిని సమర్ధిస్తున్న ప్రజలు – ప్రభుత్వాలు!! అదే ఆడపిల్ల పసుపు కుంకుమలు పోగొడితే.. తాలిబొట్టు తెంచేస్తే మాత్రం ఎందుకు అంతటి ఆలోచనలు చేయడం లేదు… మూర్ఖపు హత్యలు, కుల గజ్జి హత్యలు, ధన మధపు హత్యలు… వీటికి కూడా శిక్షలు తీవ్రంగా ఉండాలని కోరుకుంటున్నారు నేటి యువత!! కులానికో చట్టం, మతానికో న్యాయం ఉండదు, ఉండకూడదుగా? స్పందిస్తారా…??
తాజాగా తనకూతురు అవంతి.. తనకు ఇష్టం లేకుండా హేమంత్ అనే యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుందని బరితెగించిన తండ్రి లక్ష్మారెడ్డి… పదిలక్షలు సుపారీ ఇచ్చి మరీ తన అల్లుడిని చంపించాడు. అంటే ఏకంగా పది పక్షలు ఖర్చుపెట్టి మరీ తన కన్నకూతురి నుదుటున బొట్టు చెరిపేశాడు.. తాలిబొట్టు తెంచేశాడు!! ఇది పరువు హత్య కాదు.. బలుపు హత్య..!!
-CH Raja