ఇటీవల టీడీపీలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది. ఒక్కొక్క పార్లమెంటుకు నియోజకవర్గం త్వరలోనే ఒక జిల్లాగా మారనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముందు జాగ్రత్తగా.. అన్ని నియోజకవర్గాలకు నాయకులను కేటాయించారు. అదే సమయంలో రెండేసి పార్లమెంటు పార్లమెంటు స్థానాలకు కలిపి ఒకరిని సమన్వయకర్తగా నియమించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొన్నిచోట్ల ఈ కూర్పు బాగోలేదని విమర్శలు వచ్చాయి. జూనియర్లకు కూడా కీలక మైన బాధ్యతలు అప్పగించారని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, అరకు పార్లమెంటు నియోజకవర్గం జిల్లా ఇంచార్జ్‌గా నియమితులైన గుమ్మడి సంధ్యారాణి ఎంపిక విషయంపై మాత్రం టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. సమర్దురాలినే అక్కడ నియమించారని, ఆమె కష్టిస్తే.. పార్టీ పుంజుకోవడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, గడిచిన మూడు ఎన్నికలను తీసుకుంటే.. ఇక్కడ టీడీపీ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. 2009లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2014, 2019 ఎన్నికల్లో అభ్యర్థులను మార్చినప్పటికీ.. ఇక్కడ వైసీపీ విజయం దక్కించుకుని పరుగులు పెట్టింది.
కానీ, ఎస్టీ నియోజకవర్గమైన అరకులో టీడీపీ ఓటు బ్యాంకు స్థిరంగా ఉంది. గతంలో 2014 ఎన్నికల్లో గుమ్మడి సంధ్యారాణి ఇక్కడ నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేశారు. అప్పట్లో ఆమె ఓడిపోయినా.. మూడు లక్షల పైచిలుకు ఓట్లు లభించాయి. ఇక, గత ఏడాది ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ మాజీ నేత కిశోర్ చంద్రదేవ్‌కు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. అప్పుడు కూడా ఆయన ఓడిపోయినా.. మూడు లక్షల పైచిలుకు ఓట్లు లభించాయి. అంటే.. టీడీపీ ఓటు బ్యాంకు స్థిరంగా ఉంది. దీనిని కొంత మేరకు పెంచుకునే ప్రయత్నం చేస్తే.. భవిష్యత్తులో గుమ్మడి సంధ్యారాణి పుంజుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఈ నియోజకవర్గం పరిధిలోని అన్ని నియోజకవర్గాలూ రిజర్వ్‌డే కనుక ఈ అవకాశాన్ని ఆమె వినియోగించుకుంటే బెటరనేది తమ్ముళ్ల ఆలోచన. ప్రస్తుతం సంధ్యారాణి ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినా.. నియోజకవర్గంపై పట్టుంది కనుక దూకుడు పెంచితే సరిపోతుందని అంటున్నారు. మరి ఆమె వ్యూహం ఎలా ఉంటుందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.
-vuyyuru subhash