ఏపీలో రాజధానిపై రగడ కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైతే సీఎం జగన్ అసెంబ్లీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారో, అప్పటి నుంచి రాజధానిపై రచ్చ నడుస్తుంది. మూడు రాజధానులని టీడీపీతో సహ మిగిలిన ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అలాగే అమరావతి రైతులు 300 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఇలా అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతులపై వైసీపీ నేతలు చేసిన కామెంట్లు చాలానే ఉన్నాయి. చాలా తీవ్రంగానే వైసీపీ నేతలు రైతులపై, టీడీపీపై విమర్శలు చేశారు.
తాజాగా మంత్రి ధర్మానకృష్ణదాస్ అయితే తీవ్రంగా బూతులతో విరుచుకుపడ్డారు. అలాగే ఇతర మంత్రులు, వైసీపీ నేతలు కూడా తీవ్ర పదజాలంతో అమరావతి రైతులపై విరుచుకుపడుతున్నారు. వీరికి కౌంటర్‌గా టీడీపీ నేతలు దారుణంగానే మాట్లాడుతున్నారు. అయితే ఈ మాటల యుద్ధం మధ్యలోనే అమరావతి రెఫరెండం గురించి చర్చ వస్తుంది. టీడీపీ నేతలు అమరావతిపై రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లాలని కోరుతుంది.
ఇటు వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం, తన రాజీనామా విషయాన్ని మరోసారి ప్రస్తావించారు.
అమరావతికి మద్ధతుగా రాజీనామా చేస్తానని, గెలిస్తే అమరావతిలోనే రాజధాని ఉంచాలని, ఈ సవాల్‌ని స్వీకరించాలని ఎంపీ వైసీపీ నేతలని కోరారు. అటు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య రాజీనామా సవాళ్ళు నడుస్తున్నాయి. మూడు రాజధానులకు మద్ధతుగా తాము రాజీనామా చేస్తామని మంత్రులు అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్‌లు ప్రకటించారు. దమ్ముంటే ఇక్కడ కింజరాపు కుటుంబ సభ్యులతో పాటు, చంద్రబాబు గానీ, లోకేష్ పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు.
ఇదే సమయంలో వీరికి కౌంటర్‌గా ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే అశోక్, తాను రాజీనామా చేస్తానని, ఇక్కడ మంత్రి అప్పలరాజు పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. మొత్తానికైతే రాజధాని విషయంలో ఇరు పార్టీల మధ్య సవాళ్ళ పర్వం నడుస్తుంది. కాకపోతే అధికారంలో ఉన్న వైసీపీ, తమ పార్టీ ఎంపీ అయిన రఘురామ సవాల్‌పై మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఒక్కసారి సవాల్‌కు స్పందిస్తే, నరసాపురంలో పరిస్థితులు వేరుగా ఉంటాయని తెలుగు తమ్ముళ్ళు స్ట్రాంగ్‌గా చెబుతున్నారు. ఏదేమైనా అమరావతి రెఫరెండంపై వైసీపీ వెనక్కి తగ్గుతున్నట్లే కనిపిస్తోంది.
-Vuyyuru Subhash