బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా దాని ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతోంది. తీవ్రవాయుగుండం గా మారిన తర్వాత…తీరం దాటిన వాయుగుండంతో….రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వానలతో జనం ఆందోళన చెందుతున్నారు. ఖమ్మంలో అత్యధికంగా 19 సెం.మీ లకు పైగా వర్షం పడగా…హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. నగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద ఏరులై పారుతోంది. మరో రెండు రోజులు ఇలాగే భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణశాఖ.
తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలుకు చాన్స్ ఉందని తెలిపింది. GHMC కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అనవసరంగా ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు సూచించారు. పాతఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.