అమ్ముల పొదిలో ఒక్కో అస్త్రం బయటకు తీస్తున్న కాంగ్రెస్ ఇంచార్జ్…!

-

వస్తూ వస్తూనే తన మార్క్‌ పనితీరుతో హడలెత్తించారు కాంగ్రెస్‌ నేత మాణిక్యం ఠాగూర్‌. పార్టీలో ఎవరు తోక జాడించినా కత్తెర వేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌గా వచ్చినప్పటి నుంచి ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ పార్టీ నేతలకు ఓ పట్టాన అంతుచిక్కడం లేదట. ఆయన కొరకరాని కొయ్యగా మారిపోయారని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. సీనియర్‌ నేతలకు కూడా ఠాగూర్‌ లక్ష్మణ రేఖ గీయడంతో అంతా హడలిపోతున్నారు.

తన అమ్ముల పొదిలో నుంచి ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు కొత్త ఇంఛార్జ్‌. ఎవరు మాట వినకపోయినా.. తేడా వచ్చినా సోనియాగాంధీ ముందు నివేదిక పెడతానని ముఖం మీదే చెప్పేస్తున్నారట మాణిక్యం ఠాగూర్‌. రాష్ట్రానికి కొత్తగా వచ్చారు కదా.. రాన్రానూ ఆయనే అర్ధం చేసుకుంటారని అనకున్నవారికి కూడా క్రమంగా తత్వం బోధపడుతోందట. ఏమైందో ఏమో కానీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న పరిస్థితులు అవగాహన చేసుకునే కొద్దీ ఠాగూర్‌ స్ట్రిక్ట్‌ అయిపోతున్నారు.

దుబ్బాకలో అభ్యర్థిని డబ్బులు అడగొద్దని హుకుం జారీ చేశారట మాణిక్యం ఠాగూర్‌. ఏ గ్రామంలో ఖర్చు ఆ నాయకుడే భరించాలని తేల్చి చెప్పేశారట. ఏం..! పార్టీ కోసం 2 లక్షలు పెట్టలేరా? అని ముఖం మీదే చెప్పేస్తున్నారట. ఇటీవల దుబ్బాకలో జరిగిన ఓ సమావేశంలో ఠాగూర్‌ సీరియస్‌గానే వార్నింగ్‌ ఇచ్చారట. ఇకపై ఎక్కడైనా.. కేవలం జై కాంగ్రెస్‌, జై సోనియా నినాదాలు తప్పితే మరో స్లోగన్‌ వినిపించకూడదని స్పష్టం చేశారట.

ఇంఛార్జ్‌ తీసుకొస్తున్న ఈ మార్పులు కొందరికి సంతోషం కలిగిస్తున్నా.. ఇంకొందరికి రుచించడం లేదట. కాకపోతే కాలం కలిసిరానప్పుడు మౌనంగా ఉండటమే బెటర్‌ అని పెదవి విప్పడం లేదట. మరి.. నేతలు ఎన్నాళ్లిలా మౌనంగా ఉంటారో.. లేక ఠాగూర్‌ మరిన్ని అస్త్రాలు బయటకు తీస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news