ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టడమే అచ్చెన్నాయుడు దూకుడు ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా అధికార వైసీపీపై విమర్శలు చేసి ఛాలెంజ్‌లు విసురుతున్నారు. అయితే మామూలుగానే అచ్చెన్న దూకుడుగా ఉంటారు. కానీ మొన్న ఆ మధ్య ఈఎస్ఐ స్కామ్‌లో జైలుకు వెళ్లొచ్చాక కాస్త సైలెంట్ అయ్యారు. బెయిల్ మీద బయటకొచ్చాక వైసీపీ ప్రభుత్వం పెద్దగా విమర్శలు చేయలేదు. నియోజకవర్గానికే పరిమితమై కార్యకర్తలతో సమావేశమయ్యారు.
కానీ ఓ మీడియా సమావేశం పెట్టి జగన్ ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేయలేదు. అంటే ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా బాధ్యతలు ఇస్తారనే అచ్చెన్న సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. అధ్యక్ష స్థానంలోకి వచ్చాకే దూకుడుగా ఉందామని నిర్ణయించుకుని ఉంటారు. అందుకే ఇప్పుడు అధ్యక్ష స్థానంలోకి రావడమే ఆలస్యం తన గేమ్ మొదలుపెట్టేశారు. వైసీపీ ప్రభుత్వం మీద తీవ్రంగా మండిపడ్డారు. అలాగే తన అరెస్ట్ వెనుక ఉన్న కారణాలని కూడా వివరించారు.
ఇదే సమయంలో ఎప్పటి నుంచో మూడు రాజధానులపై జరుగుతున్న రగడపై కూడా స్పందిస్తూ…వైసీపీకి ఓ ఛాలెంజ్ విసిరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అమరావతి రాజధాని అని చెప్పే ఎన్నికలకు వెళ్లిందని, అలాగే వైసీపీ కూడా రాజధాని మార్పు గురించి చెప్పకుండా ఎన్నికలకు దిగిందని, కాబట్టి ఇప్పుడు మూడు రాజధానులకు మద్ధతుగా రాజీనామా చేసి ఎన్నికలకు దిగాల్సింది వైసీపీనే అని అచ్చెన్న చెబుతున్నారు.
మూడు రాజధానులకు మద్ధతుగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్దామని, అప్పుడు ప్రజలు ఏ తీర్పు ఇస్తారో చూద్దామని అన్నారు. రాజీనామా చేసే దమ్ములేకపోతే అసలు మరోసారి టీడీపీని అమరావతి కోసం రాజీనామా చేయమని మాట్లాడొద్దని సూచించారు. అయితే అచ్చెన్న సవాల్‌పై వైసీపీ స్పందించే అవకాశం అసలు లేదు. ఒకవేళ అలా అని ఎన్నికలకు వెళ్ళిన ఉత్తరాంధ్రలో టీడీపీ ఏ మేర సత్తా చాటగలదని చెప్పలేని పరిస్తితి. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, ఈ ఛాలెంజ్‌లో అచ్చెన్న ఓడిపోవడం ఖాయమని తెలుస్తోంది.
-vuyyuru subhash