నందమూరి కుటుంబానికి ప్రాధాన్యం మళ్లీ అందుకేనా…!

-

సుదీర్ఘ కసరత్తు తర్వాత ప్రకటించిన టీడీపీ సెంట్రల్‌ కమిటీ.. పొలిట్‌బ్యూరో.. తెలంగాణ టీడీపీ కమిటీలలో నందమూరి, నారా కుటుంబాలకు ప్రాధాన్యం దక్కిందనే ప్రచారం జోరందుకుంది. టీడీపీ దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తెకు టీ టీడీపీ రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. అయితే సుహాసినిని ఎందుకు కమిటీలోకి తీసుకున్నారనే చర్చ మొదలైంది. 2018లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో ఆమె టీడీపీ టికెట్‌పై కూకట్‌పల్లిలో పోటీచేసి ఓడిపోయారు.

పార్టీ పదవుల్లో కుటుంబసభ్యులు ఎక్కవగా ఉండటం చంద్రబాబుకు పెద్దగా ఇష్టం ఉండదని అంటారు. ఈసారి మాత్రం ప్రకటించిన కమిటీలలో నందమూరి.. నారా కుటుంబాల నుంచి నలుగురికి పదవులు లభించాయి. టీడీపీ జాతీయ అద్యక్షుడుగా చంద్రబాబును పక్కన పెడితే.. లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. బాలకృష్ణను తొలిసారి పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. తెలంగాణ కమిటీలోకి సుహాసిని అవకాశం కల్పించారు.

సుహాసిని అసెంబ్లీ ఎన్నికల్లో పొటీ చేసిన సందర్భంలో ఆమె సోదరులు ఇద్దరూ ప్రచారానికి వచ్చే విషయంలో రాజకీయంగా చర్చ జరిగింది. ఆ ఎన్నికల్లో ప్రచారానికి జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఇద్దరూ దూరంగానే ఉండిపోయారు. అయినప్పటికీ సుహసినికి పార్టీలో పెద్దపీట వేయడం వెనక చంద్రబాబు వ్యూహం ఉందని సమాచారం. నందమూరి కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చాం అనే మెసేజ్‌ పంపడం ఇందులో ముఖ్యమని అనుకుంటున్నారు. హరికృష్ణ మరణం తర్వాత తెరపైకి వచ్చిన ఒకటి రెండు అంశాలు చంద్రబాబును ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు సుహాసిని పదవి ఇవ్వడం ద్వారా నాటి అపవాదులను తుడిపేసుకునే ప్రయత్నం చేసినట్టు టాక్‌ నడుస్తోంది.

టీడీపీ పట్ల, చంద్రబాబు నాయకత్వంపైనా బాలయ్య పూర్తి విధేయతతో ఉన్నారు. ఈ విషయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ల నుంచి అధినేతకు కొంత గ్యాప్‌ ఉందనే ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో నందమూరి ఆడబిడ్డకు పదవి ఇవ్వడం ద్వారా హరికృష్ణ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్న మెసేజ్‌ పంపారనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి పార్టీ కార్యక్రమాల్లో కానీ.. ఇతర వ్యవహారాలలో కానీ సుహాసిని అంత యాక్టివ్‌గా ఉండే వ్యక్తి కాదనే టాక్‌ ఉంది. అయినా పిలిచి పదవిచ్చారంటే లెక్క అదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Latest news