ఒక వ్యక్తిగా రాజకీయ రంగ ప్రవేశం చేయడం పెద్ద విషయం కాదు. కానీ, ఒక నాయకుడిగా గుర్తింపు సాధించడం, నాయకుడిగా నిలబడడం అనేది మాత్రం చాలా కష్టం. దీనికి చాలా పరిశ్రమ చేయాలి. అయితే, ఎలాంటి పరిశ్రమ చేయకుండానే.. ఎలాంటి కష్టం లేకుండానే పదవులు చేపట్టిన వారికి భవిష్యత్తు ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నారు.. మాజీ మంత్రి, ఎస్సీ నాయకుడు రావెల కిశోర్‌బాబు. 2014లో అనూహ్యంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఐఆర్ ఎస్ ఉద్యోగి అయిన రావెల కిశోర్.. పెద్దగా కష్టపడకుండానే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో విజయంసాధించారు.
ఆ వెంటనే ఎస్సీ కోటాలో ఎలాంటి సిఫారసు లేకుండానే మంత్రి పీఠాన్ని అందుకున్నారు. నిజానికి పదవుల వేటలో ఏళ్లు గడిచిపోయిన నాయకులు ఎందరో ఉన్నా.. ఎలాంటి వేటా లేకుండా దక్కిన పదవులను నిలబెట్టుకునే విషయంలో కిశోర్ తీవ్ర అలసత్వం ప్రదర్శించారని.. ఆయన అనుచరులే చెబుతారు. అంతేకాదు, ఆయన అనాలోచితం, దుందుడుకు వ్యవహారం వంటివి పెనుశాపంగా పరిణమించాయని అంటారు. ఈ క్రమంలోనే తనకుమారులను అదుపులో పెట్టుకోలేక పోయారు. పలితంగా మంత్రి పదవిని పోగొట్టుకున్నారు.
పోనీ.. ఆ తర్వాత అయినా.. నిబద్ధతను చాటుకున్నారా? అంటే అది కూడా లేదు. టికెట్ ఇచ్చి.. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీకి వ్యతిరేకంగా పావులు కదిపారు. ఎన్నికలకు ముందు ఏదో ఊహించుకుని జనసేనలోకి వెళ్లారు. ఓడిపోయారు. తర్వాత కొన్నాళ్లు మెప్పించి.. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. దీంతో రాజకీయంగా అతి తక్కువ కాలంలోనే ఎంత చెడ్డపేరు తెచ్చుకోవాలో.. అంతా తెచ్చేసుకున్నారు. ఇక, ఇప్పుడు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే.. బీజేపీలో టికెట్ అంటే అంత ఆషామాషీ కాదని అంటున్నారు కమల నాథులు. ఎంతో నమ్మకం ఉంటేనే తప్ప.. ఎవరికీ అంత సులభంగా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని.. పైగా పార్టీలు మారివచ్చిన కిశోర్‌కు ఇస్తుందనే నమ్మకం లేదని అంటున్నారు. కానీ, కిశోర్ మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. బీజేపీతో పొత్తున్న నేపథ్యంలో జనసేనాని పవన్‌తోనూ సిఫారసు కోసం హైదరాబాద్‌లోనే మకాం వేశారట. మరి ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా.. ఇప్పుడు బీజేపీ టికెట్ ఇచ్చి గెలిపిస్తేనే ఆయనకు పొలిటికల్ లైఫ్ ఉందని అంటున్నారు పరిశీలకులు.