ఓడిపోతాననే భయం ఒకరిది.. ఎలాగైనా అధ్యక్ష పీటాన్ని దక్కించుకోవాలన్న కసి ఇంకొకరిది. ఇంకేముంది డాలర్లకు డాలర్లు వరదలై పారుతున్నాయి. నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆ దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చరిత్ర సృష్టించనున్నాయి. డొనాల్డ్ ట్రంప్, జోబైడెన్‌లు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకోవడంలోనే కాదు కాసులు వెదజల్లడంలోనూ పోటీ పడుతున్నారు. అధికార రిపబ్లికన్ పార్టీ, విపక్ష డెమోక్రాటిక్ పార్టీ కలిసి ఎంత లేదన్నా ఈ ఎన్నికల్లో 700 కోట్ల డాలర్లు అంటే అక్షరాల 52 వేల 101 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల ఖర్చుకు తగ్గట్టే ఆ పార్టీలకు భారీగా విరాళాలు వస్తున్నాయి. విరాళాల సేకరణలో ట్రంప్, బైడెన్‌లు ఒకరికొకరు తీసిపోనంతగా పోటీ పడుతున్నారు. కరోనా కారణంగా తొలుత విరాళాలు తక్కువగా వచ్చినా ఎన్నికల దగ్గర పడుతున్నకొద్దీ వరదలా వస్తూనే ఉన్నాయి. బడాబడా పారిశ్రామికవేత్తలు, టెక్ బాస్‌లు, హాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతల నుంచి ఉన్నత ఉద్యోగులు.. చిరుద్యోగుల వరకు ఇంకా విరాళాలు ఇస్తూనే ఉన్నారు.
ట్రంప్, బైడెన్ ఇద్దరూ రోజుకు 50 లక్షల డాలర్ల చొప్పున విరాళాలు సేకరిస్తున్నారు. కరోనా కారణంగా బాధిత ప్రజలకు ట్రంప్ ప్రభుత్వం తలో 1.200 డాలర్లు ఇచ్చింది. ఆ చెక్కులను డెమోక్రాట్ సానుభూతిపరులు నేరుగా బైడెన్‌కు పంపిస్తున్నారు. ఏదేమైనా కరోనా కారణంగా ఎన్నికల సందడి తగ్గిన ఖర్చు మాత్రం భారీగా పెరిగింది. భౌతిక ప్రచారాలు లేకపోవు. కాని పార్టీల నేతలు మాత్రం జూమ్ ద్వారా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. టీవీ ప్రకటనలు, యాడ్లు, డిజిటల్ మీడియా, పోలింగ్, బెలూన్లు వంటివాటిపై భారీగా ఖర్చు చేస్తున్నారు.
పోలింగ్ ముగిసేనాటికి రెండు పార్టీలూ ఎంతలేదన్నా 700కోట్ల డాలర్లు ఖర్చు చేస్తాయని అంచనా. అమెరికాలో ఎన్నికల్లో పార్టీలకు ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు లేదు. అయినా విరాళాలివ్వడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తారు అమెరికా బడాబాబులు.