ఉత్తరాంధ్ర రాజకీయాలకు విశాఖపట్టణం గేట్ వే. 2019ఎన్నికల్లో వైసీపీ దూకుడుకు ఒక విధంగా బ్రేకులు పడిందీ ఇక్కడే. జిల్లాలో 15అసెంబ్లీ…మూడు పార్లమెంట్ స్ధానాలు వున్నాయి. నాలుగు చోట్ల టీడీపీ గెలవగా…మిగిలిన చోట్ల వైసీపీ విజయం సాధించింది. వీరిలో భీమిలి, యలమంచిలి, పాయకరావుపేట, చోడవరం, మాడుగుల శాసనసభ్యులు మాత్రమే సీనియర్లు. ఎంపీలు ముగ్గురు రాజకీయాలకు పదవులకు దాదాపు కొత్తవారే.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాదిన్నర కాలంలో మొదటి ఆరు నెలలు అంతా సఖ్యతగానే కనిపించినా….ఆ తర్వాత కోల్డ్ వార్ మొదలైంది.ఇప్పుడు ఏ నాయకుడు మరో నాయకుడితో సఖ్యంగా వున్నట్టు కనిపించడం లేదు. ఏ ఇద్దరు కలిసి ఒక కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవు. ఎంపీలతో ఎమ్మెల్యేలకు పొత్తు కుదరడం లేదు. కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా పార్టీ నాయకత్వం పై మచ్చ వేసే ప్రచారాలు జరగడం తీవ్ర చర్చనీయాంశం అయింది.
అనకాపల్లి స్ధానం అధికారపార్టీలో అంతర్గత విభేదాలతో నలుగుతోంది. పుట్టిన రోజునాడు పంపిణీ కోసం రేషన్ బియ్యం తరలింపు వ్యవహారంలో అనకాపల్లి ఎం.పీ సత్యవతమ్మ ప్రతిష్టను దిగజార్చేందుకు సొంతపార్టీ నేతలే రచ్చరచ్చ చేశారనేది ఆమె వర్గం బలంగా నమ్ముతోంది. అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి…పాడేరు ఎమ్మెల్యే కొత్తగుళ్ళి భాగ్యలక్ష్మి మధ్య అంతర్గత వై రం నడిచింది. నామినేటెడ్ పదవులు, జెడ్పీటీసీ అభ్యర్ధుల ఎంపిక వ్యవహారంలో వీరిద్దరి మధ్య మాటపట్టింపులు ఏర్పడ్డాయి.
ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మంత్రి అవంతి మధ్య ఎడమొహం, పెడమొహం గా వుంది. ఒకరికి ఒకరు ఎదురుపడినప్పుడు ఆత్మీయత ఒలకబోసుకుంటా రు. కానీ ఈ గురుశిష్యుల మధ్య “మంత్రిపదవి” పూడ్చలేని దూరం పెంచిందనేది పార్టీ వర్గాల టాక్. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ… పార్టీలోని ఇతర నాయకులతో కలిసిమెలిసి పనిచేయ లేకపోతున్నారనే అభిప్రాయం వుంది.
ఇక విశాఖ ఎంపీ. కనస్ట్రక్షన్ వ్యా పారం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సత్యనారాయణను పార్టీలోని ఓ వర్గం దూరంగా పెట్టింద నే ప్రచారం గట్టిగా వుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు….తమ పనులు చేయించుకోవడానికి ఎక్కువ అమరావతినే నమ్ముకుంటున్నారట. స్ధానిక నాయకత్వంతో సంబంధం లేకుండా వారు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు మరో వర్గం అటునుంచి నరుక్కుని వస్తుందని చెప్పుకుంటున్నారు.ఇలా విశాఖ వైసీపీలో నేతల మధ్య కోల్డ్ వార్ ఓ రేంజ్ లో సైలెంట్ గా సాగుతుంది.