ఏపీ సీఎం జగన్ జిల్లా పర్యటనలు ప్రారంభించినట్టేనా? కరోనా కాలంలో దాదాపు అన్ని కార్యక్రమాలను ఆన్‌లైన్‌లోనే చేసిన ఆయన… ఇక నెమ్మదిగా పబ్లిక్ ఇంటరాక్షన్ మొదలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా ? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.కోవిడ్ పరిస్థితుల కారణంగా పర్యటనలకు గ్యాప్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మళ్లీ జనం బాట పట్టారు. జిల్లా పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. నేటి పశ్చిమ గోదావరి పర్యటనతోనే జనం బాట ప్రారంభమైందంటున్నారు.
ప్రస్తుతం కరోనా కేసుల ఉద్ధృతి కాస్త తగ్గడంతో మళ్లీ పబ్లిక్‌లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.ఇవాళ పశ్చిమ గోదారిలో పర్యటిస్తున్నారు. తమ్మిలేరు వరద ముంపు నుంచి ఏలూరుకు శాశ్వత పరిష్కారం లభించేలా తమ్మిలేరు వెంట రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాల్సి ఉంది. ఇది ఏళ్ళ తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్య. దీనికి గతంలో వైఎస్ కొన్ని నిధులు కేటాయించారు. ఆయన చనిపోయిన తర్వాత పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి తంగెళ్లమూడి వద్ద ఇవాళ శంకుస్థాపన చేస్తారు జగన్. అలాగే మరికొన్ని అభివృద్ధి పనుల్ని కూడా ప్రారంభించనున్నారు. మరోవైపు కోవిడ్ నిబంధనలను అంతా ఖచ్చితంగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.