ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే మన పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు గట్టిగా మందలించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలును సరిగ్గా చేయడం లేదని ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, జమ్ముకశ్మీర్‌లకు సర్వోన్నత న్యాయస్థానం ఒక్కో రాష్ట్రానికి రూ.లక్ష జరిమానా సైతం విధించింది. రియల్ టైం గవర్నెస్ అని చెప్పుకునే ఏపీలోనూ… ఈ పథకం అమలు, పరిశుభ్రత పాటించే అంశాలకు సంబంధించి సమీక్ష చేయడానికి ఆన్‌లైన్ లింక్ రూపొందించడంలో విఫలమవ్వడంతో కోర్టు ఈ జరిమానా వేసింది. అయితే గతంలోనే ఆన్‌లైన్ లింక్ రూపొందించాలని చెప్పి నెల రోజులు గడుస్తున్నా ఎలాంటి స్పందన రాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
మధ్యాహ్న భోజన పథకం దేశంలో ఎంతో మంది చిన్నారులకు ఉపయోగపడుతోందని అయితే పలు రాష్ట్రాలు దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని ధర్మాసనం పేర్కొంది. పిల్లల వివరాల నమోదులో జరుగుతున్న జాప్యంతో పాటు ఆహార ధాన్యాలు మాయమవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. పిల్లలకు ఈ పథకం ప్రయోజనం సరిగ్గా కలగడంలేదని పలు పిటిషన్లు దాఖలైనట్లు తెలిపింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ దీపక్ గుప్త, జస్టిస్ హేమంత్ గుప్తలతో కూడిన ధర్మాసనం జరిమానాను సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.