జైలు నుంచి వచ్చాక పంథా మార్చిన అచ్చెన్న !

-

మొన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పుడు ఇంకో లెక్క అంటున్నారట ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అధికారులతో సమీక్షల దగ్గర నుంచి ప్రొటోకాల్‌ సమస్యల వరకు ఏదీ వదిలిపెట్టడం లేదు. కాకపోతే మధ్యలో అధికారులు నలిగిపోతున్నారట. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ గాలిని తట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌. అప్పటి నుంచి టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఓ రేంజ్‌లో సాగుతోంది.

ఈ క్రమంలోనే ప్రొటోకాల్ రగడలు కూడా తెరమీదకు వస్తున్నాయి. గత ఏడాదిన్నరగా ఇదే సమస్య. అధికార పార్టీ నాయకులదే పెత్తనం. ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే అశోక్‌ రోడ్డెక్కి సైతం ఆందోళన చేశారు. ధర్నాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన సైలెంట్‌ అయిపోయారు. అచ్చెన్న సైతం కొత్తలో ఇలాంటి ఇబ్బందులను పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. ఇప్పుడు టాప్‌ గేర్‌లో వెళ్తుండటం జిల్లాలో చర్చకు దారితీస్తోంది.

మొన్నటి వరకూ టెక్కలిలో పట్టు సాధించేందుకు ముగ్గురు వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు సాగింది. చివరకు దువ్వాడ శ్రీనివాస్‌ను వైసీపీ ఇంఛార్జ్‌గా నియమించడంతో అంతా ఆయన కనుసన్నల్లోనే అధికారులు పనిచేస్తున్నారట. ఇంతలో అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టయి జైలుకెళ్లడంతో తమదే రాజ్యమని భావించారట వైసీపీ నాయకులు. కానీ..జైలు నుంచి వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు పంథా మార్చేశారు. దీనికితోడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కావడంతో ఇంకా స్పీడ్‌ పెంచారట.

బెయిల్‌పై విడుదలై నిమ్మాడ రాగానే తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షలు నిర్వహించారు అచ్చెన్నాయుడు. ఈ విషయం తెలుసుకున్న దువ్వాడ.. సమీక్షకు వెళ్లిన అధికారులను పిలిచి క్లాస్‌ తీసుకున్నారు. దీంతో అధికారులతో వరస సమావేశాలు నిర్వహించి మరింత వేడి పుట్టించారు అచ్చెన్న. ఇదే సమయంలో ఆయన కొత్త చర్చకు తెరతీశారు. టెక్కలిలో ప్రొటోకాల్ పాటించడం లేదని ఏకంగా అసెంబ్లీ ప్రొటోకాల్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారాయన.

ఇటీవల టెక్కలిలో నిర్వహించిన రైతు భరోసా, సచివాలయాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు తనను పిలవలేదని ఫిర్యాదులో ప్రస్తావించారు అచ్చెన్నాయుడు. వీటికి సంబంధించిన ఆధారాలను అందజేశారు. దీంతో విచారణ చేపట్టాలంటూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌కు లేఖ రాశారు అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి బాల సుబ్రమణ్యంరెడ్డి. ఆ లేఖ అందుకున్న కలెక్టర్‌.. వెంటనే నివేదికలు ఇవ్వాలని టెక్కలిలోని నాలుగు మండలాల MPDOలను ఆదేశించారు. ఈ పరిణామాలు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

వైసీపీ నేతల ఒత్తిళ్లు.. ఎమ్మెల్యే హోదాలో అచ్చెన్న ఇచ్చే ఆదేశాలకు మధ్య అధికారులు నలిగిపోతున్నారట. పైగా టెక్కలి విషయంలో ఎవరూ అతిగా స్పందించవద్దని గతంలోనే నేరుగా అమరావతి నుంచి ఆదేశాలు వెళ్లాయని చెవులు కొరుక్కుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news