చంద్రబాబు ఆ ఎంపీని పక్కన పెట్టేశారా !

-

ఆయన రెండుసార్లు ఎంపీ..సొంత పార్టీ నేతలతో తగువు పడటంలో వెనకాడరు. సోషల్‌ మీడియా వేదికగా పదునైన పదప్రయోగం చేసి సొంత పార్టీలోనే సెగలు రేపుతారు అయినా ఏం లాభం పార్టీలో మాత్రం పదవి లేదు. ఆయనే వద్దన్నారో.. లేక ఆయన్నే వద్దనుకున్నారో కానీ టీడీపీ ప్రకటించిన ఏ కమిటీలోకి తీసుకోలేదు. పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం పై టీడీపీలో ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.

కేశినేని నాని బెజవాడ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. 2019లో ఏపీలో గెలిచిన ముగ్గురు టీడీపీ ఎంపీలలో నాని ఒకరు. ఇప్పుడు పార్టీ వర్గాల్లో మరోసారి చర్చకు కారణమయ్యారు. టీడీపీ ఇటీవల ప్రకటించిన కమిటీలలో ఏ ఒక్కదానిలో కూడా కేశినేనికి చోటు దక్కలేదు. దీంతో సిట్టింగ్‌ ఎంపీని టీడీపీ పక్కన పెట్టిందా లేక ఆయనే పార్టీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నారా అన్న దానిపై చర్చ మొదలైంది.

2019 ఎన్నికల్లో వైసీపీ గాలిని తట్టుకుని బెజవాడ ఎంపీ అయ్యారు. లోక్‌సభకు ఎన్నికయ్యారు కానీ.. టీడీపీలో ఉంటూనే ఆ పార్టీలో మింగిల్‌ కాలేకపోతున్నారు. ఆయనకు పార్టీ నేతలకు మధ్య గ్యాప్‌ పెరుగుతూనే ఉంది. ఇప్పుడా గ్యాప్‌ పార్టీ పదవులకు కూడా దూరం చేసిందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. కృష్ణాజిల్లాలోని సొంత పార్టీ నాయకులతో కేశినేని నానికి పడదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే సొంతవాళ్లపై తీవ్రమైన కామెంట్స్‌ చేశారు. ఆ సందర్భంగా పార్టీ పరంగా చిక్కుల్లోనూ పడ్డారాయన. మాజీ మంత్రి దేవినేని ఉమతో విభేదాలు.. రవాణా కమిషనర్‌తో వాగ్వాదం వాటిల్లో కొన్ని. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాని మధ్య ట్విటర్‌లో పెద్దవారే జరిగింది.

2019లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపిక సమయంలోనే కేశినేని నాని అలకబూనారు. తనతోపాటు రెండోసారి గుంటూరు నుంచి గెలిచిన గల్లా జయదేవ్‌కు ఆ పదవి ఇవ్వడంతో కినుక వహించారు. ఇప్పుడు టీడీపీ కమిటీలలోనూ గల్లాకు ప్రాధాన్యం ఇచ్చారు. గల్లాను పొలిట్‌బ్యూరో సభ్యుడిని చేశారు. ఇది నాని జీర్ణించుకోలేకపోతున్నారట.

అప్పట్లో కేశినేని నాని బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. సుజాన చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌లు కాషాయ కండువా కప్పుకొన్న సమయంలోనే నెక్ట్స్‌ కేశినేని వంతేనని చర్చ జరిగింది. ఆ చర్చతో టీడీపీ అధినేత ఇబ్బంది పడ్డారట. అంతేకాదు… బెజవాడ లోక్‌సభ పరిధిలో పార్టీ కార్యక్రమాలకు పెద్దపీట వేయకుండా తన ముద్రే ఉండేలా నాని ప్రవర్తించడం కొత్త అర్థాలకు దారితీసిందని చెబుతారు.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నారో ఏమో కానీ.. సిట్టింగ్ ఎంపీగా కేశినేని నాని ఉన్న బెజవాడ పార్లమెంట్‌కు టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌ను నియమించారు చంద్రబాబు. కృష్ణా జిల్లా నుంచి టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, బొండా ఉమాలను తీసుకున్నారు. కొందరు నాయకులకైతే పార్టీ కమిటీలలో రెండేసి పదవులు వచ్చాయి. మిగతా ఇద్దరు ఎంపీలకు ఇస్తోన్న ప్రాధాన్యంలో కనీసం కూడా తనపట్ల లేదని నాని ఫీలవుతున్నారట..

Read more RELATED
Recommended to you

Latest news