పంజాబ్ రైతుల ఆందోళన ఫలించింది. 24 గంటల హైడ్రామా తర్వాత ఢిల్లీ లోకి వచ్చేందుకు అనుమతించింది కేంద్రం. దీంతో హర్యానా బోర్డర్ మీదుగా ఢిల్లీ వైపు బయలుదేరారు రైతులు. ఢిల్లీలోని నిరంకారీ గ్రౌండ్స్ లో కేంద్రం ఆందోళనకు అనుమతించింది. దీంతో కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. రైతులతో చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరారాయన. ఈ సంక్షోభానికి హర్యానా సీఎం కారణమని ఆరోపించారు. దీనిపై స్పందించిన మనోహర్‌లాల్ కట్టర్… ఆందోళనలు సమస్యకు పరిష్కారం కాదన్నారు.
చర్చలకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన పంజాబ్ రైతులు నిన్న హర్యానా దాటి ఢిల్లీలో ప్రవేశించేందుకు తీవ్రంగా ప్రయత్నించడం అడ్డుకున్న పోలీసులపై తిరబడటంతో… ఇవాళ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. మళ్లీ రైతులు ఢిల్లీకి వెళ్లే ప్రయత్నం చేయొచ్చన్న అంచనాలతో రోడ్లకు అడ్డంగా ఎక్కడికక్కడ బారికేడ్లు, ముళ్ల కంచెలు వేశారు. ఆందోళనకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఢిల్లీలో ప్రవేశించకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే… రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఢిల్లీకి వెళ్లేందుకు అనుమతించేదాకా ఆందోళన కొనసాగిస్తామంటూ… ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోనే రోడ్ల మీద బైఠాయించడంతో కేంద్ర దిగిరాక తప్పలేదు.