చాంద్రాయణ గుట్ట అసెంబ్లీ సెగ్మెంట్..ఏడు డివిజన్లలో ఎవరి సత్తా ఎంతంటే

-

హైదరాబాద్‌ పాతబస్తీ ఎమ్‌ఐఎమ్‌ అడ్డా. ఇక్కడ కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్‌ చాంద్రాయణ గుట్ట. ఏడు డివిజన్లు ఉన్న ఈ నియోజకవర్గంలో గ్రేటర్ పోరు ఎలా జరుగుతోంది.. మజ్లీస్‌ను ఢీకొడుతున్న పార్టీలేంటి మజ్లీస్ హావాకి ఈ సారి చెక్ పడనుందా ఏడు డివిజన్లలో ఎవరి సత్తా ఎంతన్న పబ్లిక్ పల్స్ పై గ్రౌండ్ రిపోర్ట్…

హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే… వాటిలో కీలకమైంది చాంద్రాయణగుట్ట అసెంబ్లీ సెగ్మెంట్‌. ఒవైసీ బ్రదర్ అక్బరుద్దీన్‌ ఈ నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో పార్టీ శ్రేణులు ఇక్కడ చురుగ్గా వ్యవహరిస్తాయి. జీహెచ్‌ఎంసీలో చాంద్రాయణగుట్ట అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి ఏడు డివిజన్లు ఉన్నాయి. జంగమ్మెట్‌, చాంద్రాయణ గుట్ట, లలితాబాగ్‌, రియాసత్‌ నగర్‌, బార్కస్‌, ఉప్పుగూడ, కంచన్‌బాగ్‌ డివిజన్లు ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. గత జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల్లో చాంద్రాయణగుట్టలోని ఏడు డివిజన్లు మజ్లీస్ ఖాతాలోనే పడ్డాయి. లలిత్‌బాగ్‌ వంటి కొన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్‌ కాస్త ప్రభావం చూపించినా జెండా మాత్రం పతంగి పార్టీదే ఎగిరింది. ఏడు డివిజన్లలో ఇద్దరు మహిళలు గత ఎన్నికల్లో మజ్లిస్‌ నుంచి గెలిచారు.

చాంద్రాయణగుట్ట అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ఏడు డివిజన్లలో కలిపి మొత్తం ఓటర్లు సంఖ్య సుమారు మూడు లక్షలు. ఈ నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు. తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక, బీదర్‌ వంటి ప్రాంతాల నుంచి పొట్టచేత పట్టుకుని వలసవచ్చిన వారే అధికం. ఇక బార్కస్‌ డివిజన్‌లో అరబ్‌ దేశీయుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఈ నియోజకవర్గంలోని ప్రజలు… ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సహకారం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్బరుద్దీన్ సొంత నియోజకవర్గమైనా ఇక్కడ సమస్యలెన్నో ఉన్నాయి. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, గంతులమయమైన రోడ్ల వంటి సమస్యలతో.. జనం విసిగి వేసారుతున్నారు. మొన్నటి వరదల సమయంలో పలు ప్రాంతాలు నీటి మునిగాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయల ఆర్ధిక సహాయం చాలా మందికి అందినా… తీవ్రంగా నష్టపోయాం అన్నది ఇక్కడి స్థానికుల ఆందోళన. వరదల సమయంలో స్థానిక రాజకీయ నాయకులు, కార్పొరేటర్‌లు తమ వైపు కన్నెత్తి చూడలేదని అంటున్నారు. గత నెలలో బార్కస్‌ డివిజన్‌లో ఉన్న చెరువుకు గండిపడటంతో లోతట్టుప్రాంతాల్లోకి వరద ఉప్పొంగింది. వారం, పది రోజుల పాటు పరిసర ఇళ్లన్నీ నీట మునిగాయని డివిజన్ వాసులంటున్నారు. కట్టుబట్టలతో బయటకు వచ్చామని, సామాన్లన్నీ రోడ్డున వేయాల్సి వచ్చిందని వాపోతున్నారు.

జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల్లో పెద్దగా ప్రాతనిధ్యంలో కనిపించని టీడీపీ కూడా ఇక్కడ ఆఫీసు తెరిచింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు కూడా జోరుగా ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల అటెన్షన్‌ తమ వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కూడా ఎంఐఎంతో సై అంటే సై అంటుంది. మజ్లీస్‌ పార్టీ మాత్రం అక్బరుద్దీన్‌ మార్క్‌ స్పీచ్‌లు, పాదయాత్రలతో హడావిడి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news