ఢిల్లీ పై దండయాత్రలో కేసీఆర్ తొలి అడుగు వేశారా ?

-

ఢిల్లీతో యుద్ధానికి శంఖం పూరించారు కేసీఆర్. ఎన్డీయే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడుతామని ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత… రైతులు తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌కు మద్దతు ప్రకటించారు. ఇతర పార్టీల నేతలతోనూ మాట్లాడారు. భారత బంద్‌కు మద్దతివ్వడం ద్వారా ఢిల్లీ పైకి దండయాత్రలో కేసీఆర్ తొలి అడుగు వేశారా అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుంది.

కేసీఆర్ రంగంలోకి దిగితే ఎట్లుంటదో మీకు తెలుసు. త్వరలోనే ఢిల్లీ మీద పోరాటం చేస్తాం. అందుకు కలిసి వచ్చే పార్టీలతో హైదరాబాద్‌లోనే కాన్‌క్లేవ్ నిర్వహిస్తానని.. గ్రేటర్ ఎన్నికల ప్రచార సమయంలోనే ప్రకటించారు కేసీఆర్. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తానని ప్రకటించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.

బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీల నేతలతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించేందుకు కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే జేడీఎస్ అధినేత కుమారస్వామికి ఫోన్‌ చేశారు. ఈ విషయాన్ని కుమార స్వామి కూడా స్పష్టం చేశారు. జేడీఎస్‌తో పాటు డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఇతర పార్టీల నేతల్ని హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి ఆహ్వనించే అవకాశం ఉంది. లాభాల్లో ఉన్న నవరత్న కంపెనీలను కూడా కేంద్రం ప్రైవేటీకరిస్తోందని.. దీని వల్ల కార్మికుల భవిష్యత్ అంధకారంగా మారుతుందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు.

కేంద్రం తీరుకు వ్యతిరేకంగా పార్టీలను కూడ గట్టడంతో పాటు.. పోరాటంలో కార్మికుల్ని, ఉద్యోగుల్ని భాగస్వాముల్ని చేసే ఆలోచనలో ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. కేంద్రంపై పోరాటంలో బాగంగా.. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులకు మద్దతు ప్రకటించింది టీఆర్ఎస్. 8న రైతులు చేపట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇటీవల కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెలోనూ టీఆర్‌ఎస్ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఎన్డీయేకు వ్యతిరేకంగా కేసీఆర్ చేపట్టబోయే పోరాటానికి సంబంధించిన కార్యాచరణ వివిధ పార్టీల నేతల సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news