రాములమ్మ టర్న్‌ కమలమ్మ..పార్టీలో పదవి పై ఆసక్తికర చర్చ

-

రాములమ్మ రిటర్న్‌ వచ్చింది. మళ్లీ కాషాయ కండువా కప్పుకుంది. పార్టీ ఆదేశిస్తే దేనికైనా రెడీ అంటోంది. ఢిల్లీ వెళ్లి కమలం పార్టీలో చేరిన ఆమెకు… ఇప్పుడు ఏ పదవి ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు విజయశాంతి చేరికలో హై డ్రామా నడిచింది. కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన విజయశాంతి… బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్‌ సింగ్‌.. విజయశాంతికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటున్న రాములమ్మ… హస్తిన వెళ్లి ముందుగా అమిత్‌షాను కలిశారు. తర్వాత ఇన్న అధికారికంగా పార్టీ కండువా కప్పుకున్నారు. 1998 జనవరి 26న బీజేపీలో చేరిన విజయశాంతి.. 2005లో కొన్ని కారణాలతో పార్టీని వీడినట్లు చెప్పారు. కేసీఆర్‌ ఒత్తిడి కారణంగా తల్లి తెలంగాణ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశానన్నారు. తెలంగాణ ఇస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రోజే కేసీఆర్‌ తనను టీఆర్‌ఎస్‌ నుంచి తొలగించారని.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరానన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన కొంతమంది కాంగ్రెస్‌ నేతలు ఆయనతో చేతులు కలిపారని ఆరోపించారు రాములమ్మ.

మరోవైపు విజయశాంతి బీజేపీలో చేరికలో ఆసక్తికర నన్నివేశాలు కనిపించాయి. ఆమె పార్టీలో చేరడానికి.. కండువా కప్పుకోవడానికి మధ్య తెలుగు సినిమా తరహాలో స్క్రీన్‌ ప్లే నడిచింది. ముందు మర్యాదపూర్వకంగా అమిత్‌షాను కలిసిన ఆమె నిన్న ఉదయం బీజేపీలో చేరారు. ముందుగా పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత సభ్యత్వ రసీదు కూడా అందించారు. అయితే తర్వాత నడ్డాను కలిశాక ఆయన పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు. విజయశాంతితో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, వివేక్‌ కూడా ఉన్నారు. అనంతరం వెంకయ్యను కూడా కలిశారు.

ఇటు బీజేపీలో విజయశాంతికి ఎలాంటి పదవి ఇస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. తెలంగాణలో బీజేపీయే ప్రత్యామ్నాయమన్న ఆమె… పార్టీని బలోపేతం చేస్తా అంటూ భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news