టీ కాంగ్రెస్‌లో దమ్మున్న నేత ఎవరు..హైకమాండ్ ఆపరేషన్ స్టార్ట్

-

తెలంగాణ కాంగ్రెస్ లో సత్తా ఉన్ననేత కోసం వేట కొనసాగుతుంది. బలంగా చెయ్యెత్తి జై కొట్టించగలిగే సత్తా ఎవరికుంది? మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చెయ్యితిరిగే నేత కాంగ్రెస్‌కు దొరుకుతాడా? ఇప్పుడు ఇదే వేటలో పడింది అధిష్టానం. అ పనిమీద ఠాకూర్‌ హైదరాబాద్‌లో ల్యాండ్‌ అవుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు అంతా కొత్త పీసీసీ చీఫ్ ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. అయితే ఎవరికి వారు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఢిల్లీ లాబీయింగ్ ఒక ఎత్తయితే… హైదరాబాద్ లో పార్టీ సీనియర్లు అంతా ఇంకో లాబీయింగ్ నడిపిస్తున్నారు.తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అంతా… ఇప్పుడు కొత్త పీసీసీని ఎంచుకునే పనిలో పడ్డారు. చాలా కాలంగా పీసీసీ మార్పుపై చర్చ సాగుతోంది. ఇప్పుడు ఉత్తమ్ రాజీనామాతో మళ్లీ లాబీయింగ్‌ మొదలైంది.

తెలంగాణ కాంగ్రెస్ లో ప్రధానంగా … ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి… రేవంత్ రెడ్డి పేర్ల చుట్టూ పీసీసీ ఎపిసోడ్‌ తిరుగుతోంది. అయితే…పార్టీలో సీనియర్లు అంతా రేవంత్ కి వ్యతిరేకంగా ఓ జట్టు కట్టారు. అవసరం అయితే త్వరలోనే ఢిల్లీకి కూడా వెళ్లాలని ఆలోచనలో ఉన్నారు. భట్టి, యాష్కి, పొన్నాల వంటివారు మంతనాలు చేస్తున్నారు. సీనియర్లంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతు పలుకుతున్నారు. ఇటు భట్టి విక్రమార్కకి సన్నిహితుడైన శ్రీధర్ బాబుని పీసీసీ చేయాలని ప్రయత్నం చేశారు. ఒకవేళ అది జరగకపోతే కోమటిరెడ్డికి అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనలో ఉన్నట్టు తెలుస్తోంది. జగ్గారెడ్డి కూడా తన పేరు పరిశీలించాలని కోరుతున్నారు.

ఇక వీహెచ్‌ విషయానికి వస్తే బీసీలకు అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలంటున్నారు. మరోవైపు టీ పీసీసీ చీఫ్‌ ఎంపికపై హై కమాండ్‌ దృష్టి పెట్టింది. రాష్ట్ర నేతలతో చర్చించేందుకు రేపు మాణిక్‌ ఠాగూర్‌ హైదరాబాద్‌ వస్తున్నారు. ఈనెల 10న నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రెండ్రోజుల పాటు ఇక్కడే ఉండి… ఎలాంటి వివాదాలు లేకుండా విషయాలు తెలుసుకుని మెజార్టీ నేతల అభిప్రాయానికి ఆమోదముద్ర వేయనున్నారు. దీంతో ఎవరు PCC చీఫ్‌ అన్న ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news