ఆయన ఒంటి చేతితోనే తన బంగ్లా నుంచి రాజకీయ వ్యూహాలు రచిస్తారు. పార్టీని నడిపిస్తారు. అలాంటిది కొన్ని రోజులుగా జిల్లాలో అంతా రివర్స్ నడుస్తోంది. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా రాజావారికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అధినేత సైతం మౌనంగా వహించారు..పార్టీనే ఆయన్ని ఒంటరి చేసిందా..విజయనగరం జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్‌గా మారాయి.
టీడీపీకి కంచుకోటగా భావించే జిల్లాల్లో విజయనగరం ఒకటి. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు ఇక్కడ టీడీపీకి పెద్ద దిక్కు. జిల్లాకు చెందిన అనేక మంది మంత్రులుగా చేసినా రాజుగారి మాటే పార్టీలో ఫైనల్. కానీ కొన్ని రోజులుగా ఇక్కడ పరిణామాలు పూర్తిగా రివర్సయ్యాయి. అశోక్‌గజపతిరాజుకు వ్యతిరేకంగా.. ఆయనకు పోటీగా టీడీపీలోని ఓ వర్గం బలమైన ఎత్తులు వేస్తోంది. జిల్లాలోనూ.. టీడీపీలోనూ ఆయన హవాకు చెక్ పెట్టాలన్నదే ఆ వర్గం ఆలోచన. కొన్నాళ్లుగా తెరవెనక సాగుతున్న ఈ వ్యవహారాలు ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. రాజుగారితో సై అంటే సై అంటున్నారు నాయకులు.
గత 4 దశాబ్దాలుగా విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు ఎవరు పేరు చెబితే వారికే టీడీపీ టికెట్. కానీ.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయన ప్రాభవం తగ్గుతూ వచ్చిందనే చెప్పాలి. కేంద్రమంత్రిగా ఆయన ఢిల్లీ వెళ్లిన తర్వాత జిల్లాపై ఫోకస్ తగ్గించారు. ఇదే సమయంలో అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు విజయనగరం జిల్లా ఇంఛార్జ్‌గా వచ్చిన తర్వాత జిల్లాలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి అశోక్, గంటా వర్గాలుగా పార్టీ నేతలు, కేడర్ విడిపోయింది.
అప్పటికే మంత్రిగా ఉన్న సుజయ కృష్ణ రంగారావు మాత్రం ఈ రెండువర్గాలతో అంటీముట్టనట్టు ఉండేవారు. ఎవరెన్ని గ్రూపులు నడిపినా.. 2019 ఎన్నికల్లో తన వారికే టికెట్లు ఇప్పించుకున్నారు అశోక్ గజపతిరాజు. ఆ పరిణామాలు టీడీపీలోని కొందరికి రుచించలేదట. తెరవెనక స్కెచ్‌లు వేస్తూ వచ్చారట. ఇంతలో పార్టీ పదవులను ప్రకటించడంతో అంతా ఓపెన్ అయిపోయారు. సీనియర్ అనుకున్నవారిని పక్కన పెట్టి కొత్తవారికి పదవులు ఇవ్వడం మరింత ఆజ్యం పోసిందని చెబుతారు. పార్టీ ఆఫీస్‌గా కొనసాగుతున్న అశోక్‌గజపతిరాజు బంగ్లాను కాదని.. కొంతమంది సొంతంగా పార్టీ ఆఫీస్‌ను తెరవడం జిల్లాలో చర్చకు దారితీస్తోంది.
అశోక్‌ను ధిక్కరిస్తూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు విజయనగరం పార్లమెంటరీ పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించగా.. ఇప్పుడు విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కొత్తగా విజయనగరం టీడీపీ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. వీరిద్దరూ అశోక్‌ను ఢీ అంటే ఢీ అంటున్నారు. మరో సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పడాల అరుణ సైతం స్వరం పెంచుతున్నారు.
జిల్లా టీడీపీ నేతలు ఇంతలా వర్గపోరుతో రోడ్డెక్కుతుంటే.. పార్టీ అధిష్ఠానం పట్టించుకోకపోవడం తెలుగు తమ్ముళ్లలో చర్చకు దారితీస్తోంది. సీనియర్ నేతలను కనీసం కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడటం లేదని తలలు పట్టుకుంటున్నారట. పార్టీ అధినేత సైలెన్స్ వెనక సామాజిక సమీకరణాలే కారణమని చర్చ నడుస్తోంది. టీడీపీలో నెంబర్ టూగా ఉన్న అశోక్‌ను పార్టీ పెద్దలు ఎవ్వరూ ఏమీ అనలేని పరిస్థితి ఉంది. పైగా ఇప్పుడు అశోక్‌ను వ్యతిరేకిస్తున్నవారంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. వారిపై చర్యలు తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నారట. దీంతో టీడీపీలో పెద్దాయన ఒంటరయ్యారా అన్న చర్చ నడుస్తుంది.