తిరుపతి లోక్‌సభకు జరగబోయే ఉపఎన్నికలో బీజేపీ-జనసేన నుంచి పోటీ చేసేది ఎవరు.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత వినిపిస్తోన్న ప్రశ్న ఇది. ఉమ్మడి అభ్యర్ధి అన్న మాట ఆయన నోటి నుంచి రావడంతో జనసేన పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది. అప్పటి వరకు హడావిడి చేసిన బీజేపీ సైలెంట్ అయింది. ఇటీవలే పవన్ కల్యాణ్, బీజేపీ నాయకులు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఆ భేటీలో తిరుపతి గురించి ఏం చర్చించారో ఏమో.. తిరుపతి కేంద్రంగా మళ్లీ కమలనాథుల సందడి జోరందుకుంది. బీజేపీ, జనసేనలతోపాటు రాజకీయ వర్గాల్లోనూ ఈ పరిణామాలు ఆసక్తికర చర్చ జరుగుతోంది.
బీజేపీ నేతలు మరోసారి జనసేనానిని జో కొట్టినట్లే కనిపిస్తుంది.తిరుపతిలో కమలనాథుల దూకుడే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. తిరుపతిలో స్పీడ్ పెంచిన బీజేపీ.. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి నుంచి పక్కా వ్యూహం అమలు చేస్తోంది. 45 మండలాల బూత్ కమిటీల బాధ్యతలను దాదాపు 15 మంది రాష్ట్రస్థాయి నాయకులకు అప్పగించి క్షేత్రస్థాయిలో పట్టు బిగించాలని అనుకుంటోంది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పదే పదే తిరుపతి లోక్‌సభ పరిధిలో పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జాతీయస్థాయి నాయకులను తిరుపతికి రప్పిస్తున్నారు. పార్టీ రాష్ట్ర సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ బూత్ కమిటీలను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ఎలా పాగా వేయాలో చెబుతున్నారట.
ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలనే తిరుపతిలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు చత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్‌సింగ్‌తోపాటు, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్, కేంద్రమంత్రి మురళీధరన్ హాజరయ్యారు. జరుగుతున్న పరిణామాలు చూస్తున్న మిత్రపక్షం జనసేన పార్టీ కార్యకర్తలకు ఏం అర్థం కావడం లేదట. ఇటీవల తిరుపతిలో పర్యటించిన పవన్ కల్యాణ్ సైతం ఉపఎన్నికకు సిద్ధంగా ఉండాలని పార్టీ కేడర్‌కు ఒక్క మాటా చెప్పలేదట. దీంతో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టడానికే జనసేనాని చూచాయగా ఒప్పుకొన్నారా అన్న అనుమానం వ్యక్తమవుతోందట.
గ్రేటర్ ఎన్నికల మాదిరే పవన్‌ను తిరుపతి విషయంలోనూ ఒప్పించారనే ప్రచారం జరుగుతోంది. కిందటి ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ సీటులో జనసేన పోటీ చేయకుండా బీఎస్పీకి మద్దతు ఇచ్చింది. 20వేల ఓట్లే వచ్చాయి. ఒంటరిగా బరిలో దిగిన బీజేపీకి 16వేల ఓట్లే దక్కాయి. కాకపోతే 1999లో ఇక్కడ బీజేపీ అభ్యర్ధి ఎంపీగా గెలిచారు. 2004లో రెండో స్థానం దక్కింది. కానీ.. తర్వాతి రోజుల్లో ఆ ఊపును నిలబెట్టుకోలేకపోయింది బీజేపీ. ఇప్పుడు రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అని భావిస్తున్న కమలనాథులు తమ శ్రేణులను, శక్తులను తిరుపతిలో మోహరింప చేస్తున్నాయి.
తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నికలో గెలవడం.. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ బలం పెరగడంతో ఏపీలోనూ బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయని లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే తిరుపతి సీటును జనసేనకు ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదని టాక్. మరి.. మిత్రపక్షాల మధ్య తిరుపతి దూరం పెంచుతుందో.. మైత్రిని పటిష్టం చేస్తుందో చూడాలి.