సింహపురి రాజకీయాల్లో వారసుల ఎంట్రీ ..జెడ్పీ పీఠమే టార్గెట్

-

రాజకీయ చైతన్యం కలిగిన నెల్లూరు జిల్లాలో మరో తరం రాజకీయాల్లోకి రాబోతోంది..కుటుంబసభ్యులను ప్రజాప్రతినిధులుగా చేయడానికి తెగ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు నేతలు. రిజర్వేషన్లు కూడా కలిసిరావడంతో వారసుల రాజకీయ అరంగేట్రానికి పావులు కదిపారు. వారసుల ఎంట్రీలో అదృష్టం ఎవరిని వరిస్తుందన్నది మాత్రం ఆసక్తిగా మారింది.

నెల్లూరు జిల్లా పరిషత్‌ చరిత్రలో తొలిసారిగా చైర్‌పర్సన్‌ స్థానాన్ని జనరల్‌ మహిళకు కేటాయించడంతో అధికార పార్టీలోని నాయకుల దృష్టి ఈ సీటుపై పడింది. రేస్‌లో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయ్‌. వారసులను రంగంలోకి దించేందుకు నేతలు కసరత్తు మొదలు పెట్టారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి కుమార్తె పూజిత పేరు తొలుత ప్రచారంలోకి వచ్చింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారామె. కాకాణి జడ్పీ చైర్మన్‌గా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ కేబినెట్‌లో చోటు దక్కలేదు. అందుకే తన కూతురు పూజితను జడ్పీ చైర్‌పర్సన్‌ను చేయాలని అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు సమాచారం.

మునుబోలు జడ్పీటీసీ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో అక్కడి నుంచి పూజితని రంగంలోకి దించారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆశీస్సులు, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితోపాటు మరికొందరి మద్దతు ఉండటంతో కుమార్తె రాజకీయ భవిష్యత్‌పై ధీమగా ఉన్నారట కాకాణి. ఇదే సమయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ రేస్‌లో బలంగా వినిపిస్తున్న మరో పేరు మేకపాటి వారి ఆడపడుచు ఆదాల రచన. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కుమార్తె అయిన రచనను బరిలో దించుతారని ప్రచారం మొదలైంది. చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తండ్రి ప్రచార బాధ్యతలను రచన పర్యవేక్షించారు.

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి సోదరుడు రాఘవరెడ్డి కోడలు. దీంతో ఎంపీ ఆదాల సైతం రచన కోసం అధిష్ఠానం పెద్దలతో సీరియస్‌గా లాబీయింగ్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే మేకపాటి కుటుంబంలో ఆమె ఒక్కత్తే సోదరి కావడంతో మంత్రి గౌతంరెడ్డి కూడా రచన కోసం పైరవీ చేస్తున్నట్లు టాక్‌. జిల్లాలో ఎమ్మెల్యే కాకాణికి వ్యతిరేక వర్గంగా ఉన్న శ్రీధర్‌రెడ్డి, మంత్రి అనిల్‌ సైతం ఆదాల రచనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని గుసగుసలాడుకుంటున్నారు. దీంతో ఈ వర్గపోరు జిల్లా రాజకీయాల దిశను మారుస్తాయనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

ఏఎస్ పేట మాజీ జడ్పీటీసీ పందిళ్లపల్లి రాజేశ్వరమ్మ పేరు కూడా తెరపైకి వచ్చింది. బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మహిళా నేతగా ఆమెకు గుర్తింపు ఉంది. రాజేశ్వరమ్మ భర్త సుబ్బారెడ్డి గతంలో ప్రాంతీయ విద్యుత్‌ మండలి చైర్మన్‌గా పనిచేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దగ్గర బంధువు. అందుకే ఆశావహుల జాబితాలో రాజేశ్వరమ్మ పేరు చేరిందట. ఒక్క జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠమే కాదు.. .జిల్లాలోని వెంకటగిరి, కోవూరు, గూడూరు, నాయుడుపేట, ఉదయగిరి నియోజకవర్గాల పరిధిలో కూడా కొన్ని జడ్పీటీసీలు జనరల్‌ మహిళలకు రిజర్వ్‌ కావడంతో వారసులను రాజకీయ అరంగేట్రం చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారట.

ఈలోపు కరోనా రావడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మళ్లీ స్థానిక వేడి రగలడంతో వారసుల ఎంట్రీ పై నెల్లూరులో ఆసక్తికర చర్చ నడుస్తుంది. మొత్తానికి జడ్పీ ఎన్నికలు కొత్త తరాన్ని ప్రజలకు పరిచయం చేయబోతున్నాయనే కామెంట్లు జిల్లాలో వినిపిస్తున్నాయి. రేస్‌లో ఉన్న వారసులంతా బలమైన రాజకీయ కుటుంబాలకు చెందిన వారే కావడంతో.. అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news