అనంత పల్లేపోరులో ఏకగ్రీవాలకు టీడీపీ బ్రేకులేసిందా ?

-

టీడీపీ బలంగా ఉండే జిల్లాల్లో అనంతపురం ఒకటి. గత ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్నడు లేని రీతిలో పరాజయం ఎదురైంది. జిల్లాలో రెండు స్థానాలు మాత్రమే దక్కించుకున్న టీడీపీ పంచాయతీ పోరులో మాత్రం కాస్త స్పీడు పెంచింది. పంచాయతీ సమరంలో వైసీపీ ఏకగ్రీవాలు అనంతలోనే తక్కువ నమోదయ్యాయట..దీంతో జిల్లాలో టీడీపీ మళ్లీ బలపడిందా లేక వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అయిందా అన్న చర్చ జిల్లా రాజకీయాల్లో నడుస్తుంది.

2019 సాధరణ ఎన్నికల్లో అనంతలో రెండు స్థానాలు మాత్రమే దక్కించుకున్న టీడీపీ మళ్లీ గాడినపడిందా అన్న చర్చ నడుస్తుంది.మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల విషయంలో మిగతా జిల్లాల్లో బాగానే ఉన్నా.. అనంతపురం జిల్లాలో వైసీపీకి అంత ఈజీ అనిపించలేదని చర్చ జరుగుతోంది. తొలి విడతలో కదిరి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 169 పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే కేవలం ఆరు చోట్లే వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నా.. ఆశించిన మేరకు యూనానిమస్‌లు కాలేదు. రెండో విడత పల్లె పోరులోనూ అదే సీన్‌ రిపీటవుతుందట..

ప్రస్తుతం జిల్లా నుంచి టీడీపీ ఎమ్మెల్యేలుగా నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్‌ ఉన్నారు. అక్కడికి సంతృప్తి చెందితే జిల్లాలోని టీడీపీ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుందని భయపడ్డారో ఏమో.. నేతలంతా కలిసి పంచాయతీ పోరులో అధికారపార్టీ దూకుడికి కొంత వరకు బ్రేక్‌లు వేశారని టాక్‌ నడుస్తుంది. ధర్మవరం, కల్యాణదుర్గం రెవెన్యూ డివిజన్‌లోని 308 పంచాయతీలకు రెండో విడతలో ఎన్నికలు జరగాల్సి ఉంటే కేవలం 14 చోట్లే వైసీపీకి ఏకగ్రీవాలు దక్కాయి. ఇక్కడ ఒక టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు. ఈ పరిణామాలు వైసీపీ నేతలకు సైతం మింగుడు పడటం లేదట.

అయితే ఏకగ్రీవాలను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు.. తొలి విడత పంచాయతీ పోరులో ఓట్ల రూపంలో షాక్‌ తగిలింది. ఎన్నికలు జరిగిన 163 గ్రామాల్లో 137 చోట్ల వైసీపీ విజయం సాధించింది. టీడీపీకి కేవలం ఇరువై ఆరే దక్కాయి. కొన్ని మండలాల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థుల అడ్రస్‌ గల్లంతైంది. నామినేషన్లు వేసిన సమయంలో ఉత్సాహంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు పోలింగ్‌ నాటికి చతికిల పడ్డారని అనుకుంటున్నారు. ఏకగ్రీవాలను అడ్డుకున్నారు కానీ.. ప్రజల నాడిని పట్టలేకపోయారని.. వారిని టీడీపీ మద్దతుదారులకు ఓటేసేలా చైతన్యం తీసుకురాలేకపోయారని అభిప్రాయపడుతున్నారు. తొలివిడతలో జరిగిన పొరపాట్లకు తావివ్వకుండా ఈ విడతలో పావులు కదుపుతుందట టీడీపీ.

ఇప్పుడు టీడీపీ నేతల దృష్టి తదుపరి విడతల పోలింగ్‌.. ఏకగ్రీవాలపై ఉందట. మరి తదుపరి విడతల్లో టీడీపీ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news