ఎన్నికల్లో అధికారులు, ఉద్యోగులు, అధికార పార్టీకి సహకరించడం, సహకరించారనే ఆరోపణలు రావడం రోటీన్. కానీ తమ బంధువులనే ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టి వారి గెలుపు కోసం కృషి చేయడం ఇక్కడ వెరైటీ. బంధు ప్రితితో డ్యూయల్ రోల్ పోషించిన అధికారులు.. ఉద్యోగుల జాబితాను ఎస్ఈసీ సిద్దం చేస్తోందట. ఎన్నికల్లో అధికారుల రాజకీయంపై నిమ్మగడ్డ స్పెషల్ ఫోకస్ పెట్టారా అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తుంది.
ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో అధికారుల బంధుప్రీతి కనిపిస్తోందా..బంధువులను ఎన్నికల్లో నిలబెట్టి, వాళ్ల తరపున పనిచేసిన అధికారుల పై తమకు అందిన కొన్ని కంప్లైంట్లు ఆధారంగా విచారణ జరిపిన అనంతరం ఎస్ఈసీ చర్యలు తీసుకోనుందని టాక్‌నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ బిజీ బిజీగా ఉన్నాయి. ఏకగ్రీవాల హడావుడి ఓ వైపు, ఎన్నిక తప్పని చోట అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం మరో వైపు, ఇలా అధికార పార్టీ-ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా ఎన్నికల హడావుడిలో ఉన్నాయి. అలాగే అధికార యంత్రాంగం కూడా ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అదే స్థాయిలో బిజీగా ఉంటోంది.
పంచాయతీ ఎన్నికలు కావడంతో క్షేత్ర స్థాయి సిబ్బంది మొదలుకుని.. ఉన్నతాధికారి వరకు అందరికీ తలకుమించిన పని ఉంటోంది. అయితే కొందరు అధికారులు మాత్రం అసలుతో పాటు కొసరు పనులతో మరింత బిజీగా ఉంటున్నారట. ఓవైపు అధికారిక విధులు నిర్వహిస్తూనే, రాజకీయ వ్యవహారాల్లోనూ తలమునకలవుతున్నారట. కొందరు ఉద్యోగుల బంధువులు ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో కొన్నిసార్లు గీత దాటి కూడా ఎన్నికల బరిలో ఉన్న తమ బంధువులకు సహకరిస్తున్నారట.తమ వాళ్లను గెలిపించుకోవాలనే ఆత్రంలో కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఈ తరహా డబుల్ యాక్షన్ చేస్తున్న ఉద్యోగులు, అధికారుల గురించి జిల్లాల్లోని ఉన్నతాధికారులకు..ఎస్ఈసీకి కంప్లైంట్లు వెళ్లినట్టు టాక్ నడుస్తోంది. అలాంటి ఉద్యోగుల జాబితాను కూడా ఎస్ఈసీ సిద్దం చేస్తోందట. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఫిర్యాదులు మరీ ఎక్కువ వచ్చాయట. ప్రకాశం జిల్లాలో అంతా తానై ఎన్నికలు నిర్వహించిన ఓ జిల్లా స్థాయి అధికారి మీదే కంప్లైంట్ వచ్చిందట.
ప్రకాశం జిల్లాలో అధికారి విషయంలోనే కాకుండా, ఇంకొందరిపై కూడా ఇదే తరహా ఆరోపణలు, ఫిర్యాదులు రావటంతో నిజానిజాలు తెలుసుకునే క్రమంలో ఎస్‌ఈసీ జాబితా రెడీ చేస్తోందని తెలుస్తుంది.