అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుగా ఛేదించేటట్లే కనిపించింది. కానీ భారత బౌలర్లు నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దీంతో ఇంగ్లండ్‌పై భారత్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. 4 టీ20 మ్యాచ్ ల సిరీస్‌ను 2-2 తో సమం చేసింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ చేపట్టింది. భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌లు రాణించారు. 31 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో యాదవ్ 57 పరుగులు చేయగా, అయ్యర్ 18 బంతుల్లోనే 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 37 పరుగులు చేశాడు. పంత్ 23 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, శామ్ కుర్రాన్లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో స్టోక్స్ (46 పరుగులు, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), జేసన్ రాయ్ (40 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, రాహుల్ చాహర్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్‌కు 1 వికెట్ దక్కింది.