కరోనా వల్ల మన జీవితాలు అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సి వస్తోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, జీవనశైలి అనారోగ్యాలు ఉన్నవారు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. అయితే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్ (ఎన్ఐహెచ్ఆర్) కు చెందిన లీసెస్టర్ బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ ప్రొఫెసర్ టామ్ యేట్స్ చేపట్టిన అధ్యయనం ప్రకారం.. నెమ్మదిగా నడిచే వారు కోవిడ్ వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేల్చారు. అలాగే ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఉత్పరివర్తనం చెందిన కరోనా వైరస్ సోకే అవకాశాలు వారికి ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
సైంటిస్టులు పైన తెలిపిన అధ్యయనానికి చెందిన వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబెసిటీలోనూ ప్రచురించారు. ఒబెసిటీ, వాకింగ్ పేస్ అండ్ రిస్క్ సివియర్ కోవిడ్ 19 అండ్ మొర్టాలిటీ, అనాలసిస్ ఆఫ్ యూకే బయో బ్యాంక్ పేరిట ఆ అధ్యయనం చేపట్టారు. దాని ప్రకారం ఒబెసిటీ అనేది కోవిడ్ వచ్చేందుకు ఒక ప్రమాదకారి అని తెలిపారు. నిత్యం శారీరక శ్రమ చేయడం లేదా కనీసం వేగంగా వాకింగ్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని తెలిపారు.
ఇక పైన తెలిపిన అధ్యయనం ప్రకారం సాధారణ బరువు ఉండి నెమ్మదిగా వాకింగ్ చేసేవారు కోవిడ్ తో మరణించే అవకాశాలు 3.75 రెట్లు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అయితే వేగంగా నడిస్తే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. మొత్తం 4 లక్షల మంది మధ్య వయస్సు ఉన్న వ్యక్తుల నుంచి సేకరించిన వివరాలను విశ్లేషించి సైంటిస్టులు ఈ అధ్యయనం చేపట్టారు. ఈ క్రమంలోనే వారు పైన తెలిపిన వివరాలను వెల్లడించారు. గంటకు 4.8 కిలోమీటర్ల వేగంతో నడిస్తే అది సాధారణ నడక అని గంటకు 6.4 కిలోమీటర్ల వేగంతో నడిస్తే అది వేగవంతమైన నడక అని తెలిపారు. అందువల్ల నెమ్మదిగా వాకింగ్ చేసేవారు, ఒబెసిటీ ఉన్నవారు వేగంగా వాకింగ్ చేయాలని, దీంతో కోవిడ్ వచ్చే రిస్క్‌ను, దాని వల్ల మరణించే రిస్క్‌ను తగ్గించుకోవచ్చని సూచించారు.