ఎమ్మెల్యే పదవికంటే సెంటిమెంటే ముఖ్యమని ఆవేశంగా రాజీనామా చేశారు విశాఖ నార్త్ ఎమ్మెల్యే మాజీమంత్రి గంటాశ్రీనివాస్. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతుగా ఆయన సమర్పించిన రాజీనామా ఇప్పుడు స్పీకర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. దీన్ని స్పీకర్ ఆమోదిస్తే మరో ఉప ఎన్నికకు ఏపీలో రంగం సిద్దమైనట్లే. ఇదే సమయంలో అధికారపార్టీలోనూ ఉపఎన్నిక పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
మాజీమంత్రి ఎమ్మెల్యే గంటాశ్రీనివాస్ పొలిటికల్ ఫ్యూచర్ ప్రస్తుతం స్పీకర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. స్టీల్ ప్లాంట్ కోసం తాను చేసిన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదని గంటా ఇప్పటికే ప్రకటించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేయబోనని కూడా ప్రకటించారు గంటా. మున్సిపల్ ఎన్నికలకు ముందు గంటా తీసుకున్న నిర్ణయం ఆయనకు పెద్దగా ఉపయోగపడినట్లు కనిపించలేదు.
గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ కె.కె రాజును ప్రోత్సహించడంతో నియోజకవర్గం పై వైసీపీ పట్టు బిగించింది. గంటా ప్రచారం చేసినా 17 డివిజన్లకుగాను ఇక్కడ 15చోట్ల వైసీపీ విజయం సాధించింది. చచ్చి చెడి బీజేపీ ఒకటి గెలవగా.. టీడీపీ ఒక్క డివిజన్‌కు పరిమితమైంది. గంటాపై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన రాజు ఇప్పుడు నియోజవర్గంలో అనధికార ఎమ్మెల్యేగా మారిపోయారు.
టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ గౌరవప్రదంగా బయటపడినా ఉత్తర నియోజకర్గంలో మాత్రం తుడిచిపెట్టేసింది. ఈ ఫలితాల తర్వాత గంటా ప్రభావంపై వైసీపీ అధినాయకత్వం ఓ అభిప్రాయానికి వచ్చేసిందట. త్వరలోనే ఉత్తర నియోజకవర్గంలో ఉపఎన్నిక ఖాయమనే చర్చ అధికారపార్టీలో జోరందుకుంది. గెలిచిన కార్పొరేటర్లు సైతం ఉపఎన్నిక పై ఉత్సాహంగా ఉండటంతో ఉప ఎన్నిక పై అధికార పార్టీలో చర్చ జోరందుకుంది.
ఇప్పటికే తిరుపతి లోక్‌సభకు ఉపఎన్నిక జరుగుతుంది. అక్కడి ఫలితం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలనేది వైసీపీ ఎత్తుగడ. ఆ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత నార్త్ ఉపఎన్నికపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయంటున్నాయి పార్టీ వర్గాలు. ఇప్పటికే విశాఖ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన వైసీపీ ఏ చిన్న అవకాశాన్ని వదులుకునే పరిస్థితి లేకపోవడంతో ఉప ఎన్నిక ఖాయమనే చర్చ అధికారపార్టీలో జరుగుతుంది.