మెదక్ జిల్లా టీఆర్ఎస్ లో వర్గపోరు మళ్లీ రచ్చకెక్కింది. జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్లో మూడు గ్రూపులు.. ఆరు గొడవలుగా రాజకీయం ఉంది. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతూ ట్రయాంగిల్ ఫైట్ నడుపుతున్నారు గులాబీ పార్టీ నేతలు. ముగ్గురూ కాకలు తీరిన రాజకీయ యోధులే. కాకపోతే పదవులను అందిపుచ్చుకునే రేస్‌లో కొందరు ముందు పరుగెడుతున్నారు.. ఇంకొందరు వెనకబడ్డారు. ఈ పదవుల పంచాయితీనే ఇప్పుడు నర్సాపూర్ టీఆర్ఎస్లో మళ్లీ చిచ్చు పెట్టింది.
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి,మాజీ మత్రి తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ,నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ మురళీ యాదవ్ ఇలా ముగ్గురు నేతలు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. గతంలో వైరిపక్షాలుగా పోరాడిన సునీతా లక్ష్మారెడ్డి, మదన్‌రెడ్డిలు ఇప్పుడు ఒకేగూటిలో ఉండటమే కాదు.. పదవులు పట్టేశారు. అయినా ఎవరి వర్గం వారిదే. మురళీయాదవ్ గతంలో టీడీపీలో ఉన్నా.. కేసీఆర్‌తో కలిసి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బయటకొచ్చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కారులోనే ప్రయాణిస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లాకు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేసినా.. పదవులు పలకరించలేదు. కళ్లముందే ఒకరు ఎమ్మెల్యే.. ఇంకొకరు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ కావడంతో మురళీ యాదవ్ అసంతృప్తితో రగిలిపోతున్నారు.
మురళీ యాదవ్ తన వర్గాన్ని మెయింటైన్ చేస్తూ ప్రభుత్వ, టీఆర్ఎస్ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. మున్సిపల్ సమావేశాలతోపాటు నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కౌన్సిలర్లను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తన వైపునకు తిప్పుకొంటున్నారన్న ప్రచారం మురళీయాదవ్‌తో రుసరుసలాడుతున్నారట. మున్సిపాలిటీలో ఏం జరిగినా తనకు తెలియాలని అధికారులను ఆదేశించారట ఎమ్మెల్యే. వచ్చే ఎన్నికల్లో తనకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే ఆశలో సర్దుకుపోతున్నా.. స్వపక్షీయులు పైకి నవ్వుతూ పలకరిస్తూ వెనక గోతులు తవ్వుతున్నారని మురళీ వర్గం అనుమానిస్తోందట.
ఇదే సమయంలో మురళీయాదవ్‌పై బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారట. కాషాయ కండువా కప్పుకొంటే నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. పక్కనే ఉన్న దుబ్బాకను గెలిచాం చూశారు కదా.. వచ్చే ఎన్నికల్లో మీరే అని చెబుతున్నారట. సీఎం కేసీఆర్ ఇలాకాలో టీఆర్ఎస్ వర్గపోరు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.