టీఆర్ఎస్ అశ్వత్థామరెడ్డి ఆపరేషన్ సక్సెస్ అయినట్టేనా ?

-

తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘంగా ఒక వెలుగువెలిగిన టీఎంయూలో చీలికలు మొదలయ్యాయి. సమ్మె తర్వాత నుంచి క్రమంగా మనుగడ కోల్పోతున్న ఈ కార్మిక సంఘంలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. పదేళ్లకుపైగా టీఎంయూ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న అశ్వత్థామరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అశ్వత్థామరెడ్డిని యూనియన్ నుంచి ఒక పద్దతి ప్రకారం అధికార పార్టీ బయటకు పంపిందా అన్న దాని పై ఇప్పుడు చర్చ నడుస్తుంది.

ఆర్టీసీ తెలంగాణ మజ్దుర్ యూనియన్‌లో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అనుకూలంగా తయారయిన ఈ గ్రూపులో వ్యతిరేక గ్రూపుని ఒక్క ప్రణాళిక ప్రకారం పక్కకు తప్పిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011లో టీఎంయూ సంఘం ఆవిర్భవించింది. టీఆర్ఎస్ అనుబంధ సంఘంగా కొనసాగుతూ వచ్చింది. మంత్రి హరీశ్‌రావు గౌరవాధ్యక్షుడిగా కొనసాగారు. కొన్ని కారణాల వల్ల 2018లో ఆ పదవి నుంచి ఆయన తప్పుకొన్నారు.

2018లో కొత్త పీఆర్సీ కోసం టీఎంయూ ఆందోళనకు దిగింది. అప్పటినుంచే ప్రభుత్వ పెద్దలు, టీఎంయూ నేతల మధ్య దూరం పెరిగింది. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం 2019లో యూనియన్లు జేఏసీగా ఏర్పాటై సమ్మెకు దిగగా.. అశ్వత్థామరెడ్డి చైర్మన్‌గా వ్యవహరించారు. 55 రోజులపాటు ఉధృతంగా కొనసాగిన సమ్మెలో సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనియన్ల నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఒకదశలో అశ్వత్థామరెడ్డి సీఎం కేసీఆర్‌కే సవాల్‌ విసిరారు. సమ్మెకు విపక్షాలు కూడా మద్దతివ్వడంతో పూర్తిగా రాజకీయరంగు పులుముకుంది.

టీఎంయూపై ప్రభుత్వ వ్యతిరేక ముద్ర పడింది. ఎట్టకేలకు సమ్మె ముగిసినా.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి పలు వరాలు కురిపించారు సీఎం కేసీఆర్‌. ఆ తర్వాత నుంచి అసలు రాజకీయం మొదలైంది. రెండేళ్లపాటు యూనియన్లను నిషేధించాలని సీఎం ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ సమ్మె తర్వాత టీఎంయులో రెండు గ్రూపులు తయారైయ్యాయి. అశ్వత్థామరెడ్డి యూనియన్‌ కార్యకలాపాలకు దూరమయ్యారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న థామస్‌రెడ్డి చురుకుగా వ్యవహరించేవారు. ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్లి కార్మికుల సమస్యలు, ఉద్యోగ భద్రతా, మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తరుచూ సమావేశం అవుతూ వచ్చారు.

టీఎంయు గౌరవ అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవితను నియమించుకోవాలని నిర్ణయించారు. టీఎంయు నుంచి అశ్వత్థామరెడ్డిని తప్పిస్తే మళ్లీ ప్రభుత్వానికి యూనియన్‌కు మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని కొందరు సర్కార్‌ పెద్దలు పొగ బెట్టారు. ఆ వెంటనే టీఎంయూ ఆదిలాబాద్‌ రీజినల్‌ సెక్రటరీ రామచంద్రారెడ్డిని కొత్త ప్రధాన కార్యదర్శిగా కేంద్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఆ విధంగా టీఎంయులో అశ్వత్థామరెడ్డి శకం ముగిసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news