క‌రోనా మూడో వేవ్ రాక ముందే.. మోదీ ప్ర‌భుత్వం తీసుకోవాల్సిన చ‌ర్య‌లు..

-

దేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న ఉత్పాతం అంతా ఇంతా కాదు. రోజూ 3 ల‌క్ష‌ల‌కు పైగా కోవిడ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు త‌గ్గుముఖం పట్టిన‌ప్ప‌టికీ ఇప్పుడే ఇంకా ఏమీ చెప్ప‌లేమ‌ని, ఇంకా కొన్ని రోజుల పాటు ఇదే ట్రెండ్ కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని, త‌రువాత సెకండ్ వేవ్ ముగిసి కొన్ని రోజుల‌కు థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని మోదీ కోవిడ్ థ‌ర్డ్ వేవ్ రాక ముందే ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

modi government should take these steps to face covid 3rd wave

1. గతంలో సార్వత్రిక ఉచిత టీకాలకు భరోసా ఇవ్వడంలో భారత ప్రభుత్వం ముందడుగు వేసింది క‌నుక‌, ఇప్పుడు కూడా కేంద్రం కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను సేకరించి రాష్ట్రాలకు అందుబాటులో ఉంచాలి. ఒక లెక్క ప్రకారం కేంద్ర ఖజానాకు మొత్తం టీకాల‌కు ఖర్చు రూ.28,000 కోట్ల నుండి రూ.35,000 కోట్ల వ‌ర‌కు అవుతుంద‌ని వెల్ల‌డైంది. ఈ మొత్తాన్ని ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో ఇప్పటికే కేటాయించారు. వ్యాక్సిన్ల పంపిణీ ఖర్చు ఎంతైనా స‌రే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు భ‌రించాలి. ఇందుకు రెండు ప్ర‌భుత్వాలు చొర‌వ తీసుకోవాలి. దీంతోపాటు టీకాల‌కు స‌రైన ధ‌ర‌ల‌ను కూడా నిర్దారించాలి.

2. భారతదేశంలోని ప్రతి జిల్లా ఆసుపత్రిలో ఒక ఆక్సిజన్ ప్లాంట్‌ను త్వరగా ఏర్పాటు చేయడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి. ఈ ప్లాంట్లు జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, ఇతర ఆసుపత్రుల ఆక్సిజ‌న్ కొర‌త‌ను కూడా తీర్చగలవు. కేంద్రీకృత సమయ-ఆధారిత సేకరణ, అవసరమైతే దిగుమతి చేసుకోవడం వంటి విధానాల‌ను అనుస‌రించాలి.

3. సుమారుగా 50 కోట్ల మంది భారతీయులు 18-44 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. వీరి కోసం మొత్తం 100 కోట్ల టీకాలు అవసరం. మహమ్మారి మూడవ వేవ్‌ను నివారించడానికి వచ్చే ఆరు నెలల్లో మొత్తం టీకా కార్యక్రమం పూర్తి కావడం అవసరం. ఇందుకోసం ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి. మొదట యూఎస్, యూకే, యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి వ్యాక్సిన్ల‌ను పెద్ద ఎత్తున దిగుమ‌తి చేసుకోవాలి. అలాగే టీకా ఉత్ప‌త్తిని పెంచేందుకు పేటెంట్, లైసెన్స్‌లు అడ్డు వ‌స్తాయి క‌నుక ఆ అవాంత‌రాలు లేకుండా చూసుకోవాలి. దీంతో టీకాల ఉత్ప‌త్తి పెరిగి పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటాయి.

4. భార‌త దేశంలో ఇప్ప‌టికీ చాలా మందికి ఇంట‌ర్నెట్ స‌దుపాయం అందుబాటులో లేదు. క‌నుక వారు ఆరోగ్య సేతు, కోవిన్ యాప్‌ల లో టీకాల కోసం రిజిస్ట‌ర్ చేసుకోలేరు. కాబ‌ట్టి వారిని టీకా కేంద్రాల‌కు తీసుకురావ‌డానికి ఆశ కార్య‌క‌ర్త‌లు, ఇత‌ర వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఉపాధ్యాయుల‌ను రంగంలోకి దించాలి. దీంతో మ‌రింత మంది టీకాల‌ను వేయించుకుంటారు. టీకాల పంపిణీ ప్ర‌క్రియ సుల‌భ‌త‌రం అవుతుంది. చికెన్ పాక్స్‌, పోలియో వంటి టీకా కార్య‌క్ర‌మాల త‌ర‌హాలో కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయాలి.

5. క‌రోనా మొద‌టి వేవ్ క‌న్నా రెండో వేవ్‌లోనే చాలా మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయారు. కోవిడ్ మూడో వేవ్ వ‌స్తే ఇలాంటి బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. దీంతో దేశంలో తీవ్ర‌మైన సంక్షోభం ఏర్ప‌డుతుంది. అలా కాకుండా ఉండాలంటే పేద‌ల‌కు ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయాలి. నిరుద్యోగుల‌కు నెల‌కు రూ.5000 నుంచి రూ.6000 వ‌ర‌కు భృతిని అందించాలి. జ‌న్ ధ‌న్ ఖాతాలు ఉన్న‌వారికి న‌గ‌దు స‌హాయం అందించాలి. చాలా వ‌ర‌కు ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను ఇది తీరుస్తుంది. చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, చిరు వ్యాపారుల ఉపాధికి మ‌రింత స‌హాయం చేయాలి. దీంతో ఆర్థిక వృద్ధి పూర్తిగా కుంటు ప‌డ‌కుండా ఉంటుంది.

6. ఆయుష్మాన్ భారత్ పథకం పూర్తి స్థాయి ఆడిట్‌కు కేంద్రం వెంటనే ఆదేశించాలి. పేదలు నిజంగా దాని నుండి ప్రయోజనం పొందుతున్నారా అని నిర్ధారించాలి. అవ‌స‌రం అయితే మ‌రింత మందిని ఈ ప‌థ‌కం కింద‌కు తీసుకురావాలి. ప్రైవేలు హాస్పిట‌ల్స్ ఈ ప‌థ‌కం ద్వారా పేద‌ల‌కు ల‌బ్ది అందిస్తున్నాయా, లేదా అనే విష‌యాల‌ను ప‌రిశీలించాలి.

7. జన ధన్ యోజన కింద రూ.2 లక్షల బీమా కవరేజీని బీమా సంస్థలు లబ్ధిదారులకు చెల్లిస్తున్నాయా అనే దానిపై బహిరంగ విచారణ జరపాలి. అందుకు బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీని నియ‌మించాలి.

8. కోవిడ్ సెకండ్ వేవ్ నేప‌థ్యంలో లాక్ డౌన్‌ను విధించుకునే అవ‌కాశాన్ని రాష్ట్రాల‌కే ఇచ్చారు. కానీ దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉంటే మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు క‌నుక కేంద్రం ఆ దిశ‌గా ఆలోచించాలి. క‌రోనా మూడో వేవ్ రాక‌ముందే దీనిపై నిర్ణ‌యం తీసుకోవాలి. దీంతో మూడో వేవ్ వ‌చ్చినా కోవిడ్ సంక్ర‌మ‌ణ శాతం త‌గ్గుతుంది. ఇలా స‌మ‌ర్థ‌వంతంగా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ సూచ‌న‌ల‌ను ఇప్ప‌టి నుంచే పాటిస్తే కోవిడ్ పై పోరాటంలో భార‌త్ విజ‌యం సాధిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news