డాక్ట‌ర్ సుధాక‌ర్‌ది ప్ర‌భుత్వ హ‌త్యే

-

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుడు సుధాకర్‌ (52) గ‌త శుక్ర‌వారం గుండెపోటుతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. కాగా డాక్టర్ సుధాకర్‌ కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ సోమవారం ప‌రామ‌ర్శించారు. సీత‌మ్మ‌ధార‌లోని సుధాక‌ర్ ఇంటికి వెళ్లి డాక్టర్ సుధాకర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన చిత్ర‌ప‌టానికి నివాళులు అర్పించారు.

అనంతరం లోకేశ్ మాట్లాడుతూ… డాక్టర్ సుధాక‌ర్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఒక గొప్ప డాక్టర్ ని సీఎం జగన్ బలి తీసుకున్నారని అన్నారు. డాక్టర్ సుధాకర్ మాస్క్ ఇవ్వమని అడిగినందుకు వైసీపీ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టిందని, నడి రోడ్డుపై పడేసి చేతులు వెనక్కి విరిచి వేధించారని, పిచ్చోడనే ముద్ర వేసారని అన్నారు. ఈ కేసులో కుట్ర కోణం ఉందని సీబీఐ హైకోర్టుకి నివేదిక అందజేసిందని అయితే న్యాయం జరిగే లోపే డాక్ట‌ర్ సుధాక‌ర్‌ చనిపోవడం బాధాకరమని లోకేశ్ పేర్కొన్నారు.

డాక్టర్ సుధాకర్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం తక్షణమే ఆయన కుటుంబానికి కోటి రూపాయిలు ఆర్థిక సహాయం అందజేసి తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం దళితులపై దాడులు ఆపాలని డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news