రేపు జరగబోయే తెలంగాణ కేబినెట్ భేటీలో తమ 9 డిమాండ్లపై చర్చించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో వెబినార్ జరిగింది. ఈ వెబినార్ లో కోదండరాంతో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, కె. రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఈ వెబినార్ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ… హైదరాబాద్ లో కూర్చున్న ముఖ్యమంత్రికి క్షేత్రస్థాయి పరిస్థితులు అవగాహనలో లేవని అన్నారు. తమకు అందిన అన్ని జిల్లాలవారు స్థానిక పరిస్థితుల గణాంకాలను పరిశీలిస్తే ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్లు అర్థం అయిందని అన్నారు. కరోనా కట్టడిలో భాగంగా కోదండరాం ప్రభుత్వం ముందు 9 డిమాండ్లను ఉంచారు. ఈ డిమాండ్ల సాధనకు ఆదివారం ఉదయం 8 నుంచి 9 వరకు ఒక గంట మౌన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.
రాజ్యాంగం అందించిన జీవించే హక్కు ప్రకారం అందరికీ వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. దీని కోసం ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించాలి. ప్రభుత్వ వైద్య శాలలను బలోపేతం చేసి ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించడంతో పాటు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఉచిత వైద్యం అందించాలి. కావలసినన్ని కరోనా టెస్టు కిట్లను అందుబాటులోకి తెచ్చి గ్రామ స్థాయిలోనే కావలసిన పరీక్షలు చేయాలి. గ్రామ స్థాయిలో ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి కరోనా సోకిన వారికి మందులు, పోషకాహారాలతో కూడిన భోజనం ఇవ్వాలి. ప్రభుత్వమే అందరికీ ఉచితంగా టీకాలు వేయించాలి. దీనికోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.
వైద్య రంగానికి సంబంధించి బ్లాక్ మార్కెటును రూపు మాపడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం సెక్షన్ 12 / 3 ప్రకారం విపత్కర పరిస్థితిలో కరోనా మృతుల కుటుంబ సభ్యులకు, జీవనోపాధి దెబ్బతిన్న వారికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. . ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అడ్డుకునేందుకు వెంటనే ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. కరోనా వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వం ప్రజలందరినీ భాగస్వాములను చేయాలి. రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, పౌర వేదికలను విశ్వాసంలోకి తీసుకోవాలి. వారితో చర్చించి ప్రజారక్షణ నిర్ణయాలు తీసుకోవాలి. ఈ డిమాండ్లను కేబినెట్ భేటీలో చర్చించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.