హైదరాబాద్: ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ పత్రాన్ని ఆయన అసెంబ్లీ కార్యదర్శికి పంపారు. గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ఆయన రాజీనామా పత్రాన్ని పంపారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ కూడా తెలంగాణ అమవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేసీఆర్ మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, టీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చి ఉండొవచ్చు గాని గెలిపించింది మాత్రం ప్రజలేనన్నారు. హుజురాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం జరగబోతోందని ఆయన తెలిపారు. అధికార దుర్వినియోగం చేసి ఉపఎన్నికలో గెలవాలని చూస్తున్నారని ఈటల ఆరోపించారు. 17 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగానని చెప్పారు. కరోనాతో తెలంగాణలో వేల మంది చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోదని విమర్శించారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని చెప్పారు. సమైక్య పాలకుపై అసెంబ్లీలో గర్జించానని ఈటల తెలిపారు.
ఇక ఈటల రాజేందర్ ఈ నెల 14న బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈటల సహా ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ కూడా కాషాయం జెండా కప్పుకోనున్నారు.