ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశ యాప్ అవగాహన సదస్సు కార్యక్రమాల్లో పాల్గొనడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న దీక్షను పక్కదారి పట్టించేందుకే జగన్ ఈ కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు.
కాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా బాధితులను ఆదుకోవాలనే డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మంగళవారం సాధన దీక్ష చేపట్టిన విషయం తెల్సిందే. సాధన దీక్షలో భాగంగా అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు దీక్షకు కూర్చొన్నారు. ఇక అదే సమయంలో సీఎం జగన్ నేడు విజయవాడలోని గొల్లపూడిలో నిర్వహించిన దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దిశ యాప్ అవగాహన సదస్సుపై లోకేష్ విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్ అత్యాచారాలపైనా కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. సీఎం ఇంటి పక్కనే గ్యాంగ్ రేప్ జరిగి 10 రోజులవుతున్నా నిందితుల్ని పట్టుకోని జగన్ ప్రభుత్వం..దిశ యాప్ డౌన్లోడ్ పేరుతో సొంత పత్రికకు కోట్ల రూపాయల ప్రకటనలిచ్చిందని మండిపడ్డారు. సొంత అక్కాచెల్లెళ్లు షర్మిల, సునీతలకే భద్రత లేక ఒకరు తెలంగాణలో, ఇంకొకరు పోలీసుల చుట్టూ తిరుగుతుంటే.. “అక్కచెల్లెమ్మల భద్రత-జగనన్న ప్రభుత్వ బాధ్యత“ అంటూ ఎందుకు ఇలాంటి కపట ప్రకటనలని ప్రశ్నించారు. కరోనా బాధితుల డిమాండ్ల సాధనకు చంద్రబాబు చేపట్టిన దీక్షను పక్కదారి పట్టించేందుకు ఈ కార్యక్రమాలని ఆరోపించారు.