తెలంగాణ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక huzurabad bypoll కు ముహూర్తం ఖరారయింది. ఉప ఎన్నిక తేదీ ఖరారు కాక మునుపే బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ప్రచార వేడి పుట్టిస్తున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మండలాల వారీగా ఇన్ చార్జులను నియమించి.. బాధ్యతలను అప్పగించింది. అందుతున్న సమాచారం మేరకు ఆగస్టులో ఈ ఉప ఎన్నిక షెడ్యూల్ ఉంటుందట. కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న దాదాపు 50 నియోజకవర్గాల్లో హుజురాబాద్ తో పాటే ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం అనుకుంటుందట. ఈ ఉప ఎన్నికను కరోనా కారణంగా అక్టోబర్ వరకు నిర్వహించాలని మొదట భావించినా… ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో ముందు ఇక్కడ ఉప ఎన్నిక పూర్తి చేయాలని అనుకుంటున్నారు.
ఇక నోటిఫికేషన్ త్వరలో వస్తుందని తెలియడంతో ఇక్కడ పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలన్నీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ నుంచి గత ఆరు ఎన్నికల్లో గెలిచి… ఇన్నాళ్లు… వైద్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈటల రాజేందర్ కాషాయ కండువా కప్పుకుని ఈ సారి కమలం పువ్వు గుర్తుతో పోటీలో నిలవనున్నారు. నిన్న మొన్నటి వరకు అసలు పోటీలో లేనట్లే కనిపించిన కాంగ్రెస్ పార్టీ కూడా నూతన ఉత్తేజంతో బరిలోకి దిగుతోంది. ఇదిలా ఉండగా… బీజేపీ రథసారధి బండి సంజయ్ తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి.
ఎలాగైనా సరే ఈ ఉప ఎన్నికల్లో గెలిచి నిలవాలని టీఆర్ఎస్ చూస్తుండగా…. రాష్ర్టంలో అధికార టీఆర్ఎస్ కు మేమే ప్రత్యామ్నాయం అని చాటి చెప్పుకోవాలని బీజేపీ యోచిస్తోంది. నూతనంగా పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారిగా జరుగుతున్న ఉప ఎన్నిక కావున సత్తా చాటాలని కాంగ్రెస్ కలలు కంటోంది.