తెరాస అధినేత కేసీఆర్ పై ఒంటికాలిపై లేసి విమర్శలు చేసిన గజ్వేల్ కాంగ్రెస్ సీనియర్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఎట్టకేలకు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో శుక్రవారం సాయంత్రం 5.20 గంటలకు ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వంటేరు మీడియాతో మాట్లాడుతూ… తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి తాను సైతం భాగం కావాలని భావించి పార్టీలో చేరుతున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ఆహ్వానం మేరకు తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వివరించారు. కేటీఆర్ తనను తెరాసలోకి రావాలని 2009లో, 2014లోనూ ఆహ్వానించారని నా స్వయం తప్పిదం వల్ల పార్టీలోకి సరైన సమయంలో రాలేక పోయానన్నారు.
ఇప్పటికైనా తాను ప్రజల అభిప్రాయాన్ని, అభిష్టాన్ని గమనించి నియోజక వర్గ పురోగతికి పాల్పడతానన్నారు. వంటేరు చేరిక సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వంటేరు వంటి వ్యక్తి తెరాసకు ఎంతో అవసరం అని తామెన్నడో గమనించాము…ఆమేరకు కేసీఆర్ సైతం ఎన్నో సార్లు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రతాప రెడ్డి చేరికతో గజ్వేల్లో తెరాస పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించిందని పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో వంటేరుకి సాటిలేరేవ్వరు అని తెలిపారు.