భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి ఎవరికీ పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తుల్లో ఒకడు. అన్ని సోషల్ ప్లాట్‌ఫామ్స్ కలిపి కోహ్లికి సుమారుగా 228 మిలియన్లకు పైగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే కోహ్లి అనేక కంపెనీల ఉత్పత్తులకు ప్రచారకర్తగా కూడా ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన యాన్యువల్ రిచ్ లిస్ట్ సెలబ్రిటీలలో టాప్ 20లో కోహ్లి ఉన్నాడు.
ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఆయా కంపెనీలకు చెందిన పోస్టులు పెట్టడం ద్వారానే కోహ్లి కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా కోహ్లి పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన ఓ పోస్టును పెట్టాడు. దీంతో చిక్కుల్లో పడ్డాడు.
జపాన్ రాజధాని టోక్యోలో ఒలంపిక్స్ జరుగుతున్న నేపథ్యంలో అనేక మంది ఇండియన్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. అయితే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన 10 శాతం మంది విద్యార్థులు ప్రస్తుతం ఒలంపిక్స్‌లో ఆడుతున్నారు. ఇదే విషయాన్ని కోహ్లి తన సోషల్ ఖాతాల్లో పోస్ట్ చేశాడు. అది పెయిడ్ పోస్టు. అయితే ఆ పోస్టులకు పెయిడ్ ప్రమోషన్ అనే ట్యాగ్ ఇవ్వలేదు. దీంతో కోహ్లి సమస్యల్లో ఇరుక్కున్నాడు.
అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కి) ఇదే విషయంపై కోహ్లికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆస్కి సెక్రెటరీ జనరల్ మనిషా కపూర్ వెల్లడించారు. పెయిడ్ ప్రమోషన్ అనే ట్యాగ్ లేకుండా అలా పోస్టులను పెట్టకూడదని, కోహ్లి నిబంధనలను ఉల్లంఘించాడని, అందుకనే కోహ్లికి నోటీసులు పంపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే కోహ్లి ఆ నోటీసులకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆ యూనివర్సిటీకి చెందిన పోస్టులు పెట్టినందుకు కోహ్లిని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ కూడా చేస్తున్నారు.