గూగుల్ త‌న క‌ద‌లిక‌ల‌ను ట్రాక్ చేస్తుందంటూ కోర్టుకెక్కాడత‌ను..!

-

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ ను ఓ వ్య‌క్తి కోర్టుకీడ్చాడు. త‌న అనుమ‌తి లేకుండానే త‌న క‌ద‌లిక‌ల‌ను ట్రాక్ చేసి వాటిని సేవ్ చేస్తూ త‌న వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం క‌లిగిస్తుంద‌ని ఆరోపిస్తూ ఓ వ్య‌క్తి గూగుల్‌ను కోర్టుకీడ్చాడు. శాన్‌ఫ్రాన్సిస్కో ఫెడ‌రల్ కోర్టులో ఆ వ్య‌క్తి కేసు వేశాడు. ఫోన్‌లో లొకేష‌న్ హిస్ట‌రీని ఆఫ్ చేసి ఉంచిన‌ప్ప‌టికీ గూగుల్ స‌ర్వీసెస్ మ‌న క‌ద‌లిక‌ల‌ను ట్రాక్ చేస్తుందంటూ ఆ వ్య‌క్తి ఆరోపిస్తూ కోర్టుకెక్కాడు.

అమెరికాలో ఉన్న ఆండ్రాయిడ్‌, ఐఫోన్ యూజ‌ర్లు చాలా మంది త‌మ త‌మ ఫోన్ల‌లో గూగుల్ సెట్టింగ్స్‌లో లొకేషన్ హిస్ట‌రీని ఆఫ్ చేస్తున్నార‌ని, అయిన‌ప్ప‌టికీ యూజ‌ర్ల స‌మాచారాన్ని గూగుల్ స‌ర్వీసెస్ రికార్డు చేస్తున్నాయ‌ని అత‌ను ఆరోపిస్తున్నాడు. యూజ‌ర్లు ఎక్క‌డికి వెళ్తున్నారు, ఏ మార్గంలో వెళ్తున్నారు తదిత‌ర స‌మాచారాన్ని నిక్షిప్తం చేయ‌కుండా ఉండేందుకు సెట్టింగ్స్‌లో లొకేషన్‌ హిస్టరీని ఆఫ్‌ చేసుకోవచ్చని గూగుల్‌ తన సపోర్ట్‌ పేజీలో తెలిపిందని.. అయిన‌ప్ప‌టికీ అలా ఆఫ్‌ చేసినప్పటికీ గూగుల్‌ ఆ వివరాలను ట్రాకింగ్‌ చేస్తోందని, దీనిపై గూగుల్‌ చెప్పిందంతా అబద్ధమని ఆ వ్య‌క్తి త‌న‌ దావాలో పేర్కొన్నాడు. ఈ క్ర‌మంలోనే గూగుల్‌ ప్రైవసీ చట్టాన్ని గూగుల్‌ ఉల్లంఘించిందని.. గత వారం యూనివర్సిటీ పరిశోధకులు కూడా దీన్ని నిరూపించారని ఆ వ్య‌క్తి కోర్టుకు వివరించాడు.

అయితే మ‌రో వైపు ఈ కేసుపై స్పందించేందుకు గూగుల్‌ నిరాకరించింది. కాగా ప్రైవసీ పాలసీకి సంబంధించి 2011 నాటి ఉత్తర్వులను గూగుల్‌ ఉల్లంఘించిందా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని ది ఎలక్ట్రానిక్‌ ప్రైవసీ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ అనే సంస్థ కూడా అమెరికా ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌కు లేఖ రాసింది. ఇక ఈ విష‌యంలో కోర్టు తీర్పు ఎలా వ‌స్తుందో వేచి చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news