అసలే చలికాలం.. బయటికెళ్తే చాలు.. చలికి చర్మం పొడిబారిపోతుంటుంది. దీంతో చర్మం కాంతివంతంగా కనిపించదు. ముఖం కూడా పొడిబారిపోతుంటుంది. అందుకే.. చలికాలంలో ఇంటివద్దే కొన్ని టిప్స్ పాటిస్తే.. మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది. చలికాలంలో దొరికే పళ్లతో ఇంటివద్ద ఫేస్ ప్యాక్ చేసుకుంటే ముఖం మీద ఉన్న చర్మం కాంతివంతమవుతుంది.
ఈ సీజన్ లో దొరికే నారింజ, యాపిల్, అరటిపండు.. వీటితో ఫేస్ ప్యాక్ లను చేసుకోవచ్చు. నారింజ తొక్కులను ఎండబెట్టి ఆ తొక్కలను పొడి చేసి… ఆ పొడిలో కొద్దిగా తేనె, కొంచెం యోగర్ట్, కొంచెం ఓట్ మీల్ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. తర్వాత దాన్ని ముఖానికి రాసుకోవాలి. కొంచెం సేపు తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. దీంతో ముఖం మీద ఉన్న చర్మం తేజోవంతంగా తయారవుతుంది.
యాపిల్ పండు పైన ఉండే తోలు తీసేసి… దాని గుజ్జును మెత్తగా చేసి… దానికి కొంచెం తేనె కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ఆ పేస్ట్ ను ముఖానికి పెట్టుకోండి. కొంచెం సేపు తర్వాత దాన్ని వేడినీళ్లతో కడుక్కోవాలి.
బాగా పండిన రెండు అరటి పళ్లను తీసుకొని.. వాటి పొట్టు తీసి పళ్లను గుజ్జు గుజ్జుగా చేసుకోవాలి. ఆ గుజ్జుకు కొంచెం తేనె, ఓ స్పూన్ యోగర్ట్ కలిపి పేస్టులా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. కొంతసేపటి తర్వాత నీళ్లతో కడిగేయండి. అంతే… మీ చర్మం కాంతివంతమవుతుంది.