ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు కొడుకుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా కూడా లోకేష్ కు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు అనేది మాత్రం రాలేదు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఆయన ఓడిపోవడంతో సొంత పార్టీ నేతల్లో కార్యకర్తల్లో కూడా లోకేష్ నాయకత్వంపై నమ్మకం లేకుండా పోయింది. దీంతో ఆయన ఇప్పుడు పూర్తిగా తన వైఖరి మార్చేసుకున్నారు. ఎలాగైనా ప్రజల్లో మంచి ఇమేజ్ తెచ్చుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే తన డ్రెస్సింగ్ స్టైల్ దగ్గరి నుంచి రాజకీయంగా విమర్శలు చేసే వరకు అన్ని మార్చేసుకున్నారు.
ఈ కారణాలతో ఇప్పుడు లోకేష్ గ్రాఫ్ ఏపీ రాజకీయాల్లో పెరుగుతోంది. కాగా ఇంత జరుగుతున్నా కూడా లోకేష్‌కు బలంగా ప్రజల నుంచి మాత్రం ఆదరణ రావట్లేదు. మరీ ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడికి ప్రజల దగ్గరి నుంచి సానుభూతి పరమైన ఆదరణ అనేది చాలా అవసరం. అది తమ కోసం ఆ నాయకుడు పోరాడుతున్నాడనే భావన వారిలో కలగాలి. వారి కోసం అవసరమైతే కేసులు కూడా వేయించుకుంటేనే బలమైన నమ్మకం ఏర్పడుతుంది. ఇక ఈ క్రమంలోనే గుంటూరులో రీసెంట్ గా జరిగిన ఘటన లోకేష్ కు బాగా కలిసి వచ్చింది.
బీటెక్ స్టూడెంట్ అయిన రమ్య హత్య కేసులో లోకేష్ దూకుడుగా వ్యవహరించడంతో చివరకు ఆయను పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది. కాగా ఇప్పటి దాకా లోకేష్ ఎన్ని నిరసనలు చేసినా కూడా పోలీస్ కేసులు, అరెస్టులు అనేవి లేవు. ఈ కారణాలతో లోకేష్ కు నిజంగా ప్రజలపై ప్రేమ లేదని, అందుకే కేసులంటే భయపడుతున్నారని ఇప్పటి వరకు వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు లోకేష్ అరెస్టు కావడంతో ఆయనకు ప్రజల్లో ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. మొత్తానికి లోకేష్‌కు బాగానే కలిసి వస్తోందన్నమాట.