ఆన్ లైన్ లో ఏది కావాలన్నా దొరికేస్తుంది. చిన్న పూచిక పుల్ల మొదలుకుని పెద్ద యంత్రాల వరకు ఆన్ లైన్లో దొరుకుతున్నాయి. కరోనా మూలంగా ఈ ఆన్ లైన్ వ్యాపారం పల్లెపల్లెకూ చేరింది. ప్రస్తుతం చాలా ఊళ్ళలో ఆన్ లైన్లోనే వ్యాపారం జరుగుతుంది. ఐతే తాజాగా ఆన్ లైన్ లోకి వేపపుల్లలు కూడా వచ్చేసాయి. ఆర్గానిక్ టూత్ బ్రష్ గా ఉపయోగించే వేపపుల్లలను ఆన్ లైన్లో అమ్ముతున్నారు. వేపపుల్లలను అమ్మడంలో సమస్య ఏమీ లేదు కానీ, దాని రేటు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
అవును, పళ్ళు తోముకునే వేపపుల్ల 1800రూపాయలట. ఈ మేరకు అమెరికా ఈ కామర్స్ కంపెనీ ఆన్ లైన్లో అమ్మకం పెట్టింది. ఆర్గానిక్ టూత్ బ్రష్ గా చెబుతూ $24.99గా ధర నిర్ణయించింది. అంటే ఇండియా రూపాయల్లో దాని ధర 1825.34రూపాయలు అన్నమాట. ఐతే ఇక్కడ ఈ వేపపుల్లను ఎలా ఉపయోగించాలో కూడా ఆ కంపెనీ వివరించింది. ముందుగా వేపపుల్లను తీసుకుని ఒక అంచున గట్టిగా కొరకాలి. అప్పుడు బ్రష్ లాగా మారుతుంది. దాంతో చిగుళ్ళ వరుసవైపు పళ్ళు తోమాలి.
ఒకసారి తోమిన తర్వాత పారేయకుండా మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకునే అవకాశం కూడా ఉందని ఆ కంపెనీ తెలిపింది. అప్పటి వరకూ బ్రష్ లాగా ఉన్న వైపును కత్తిరించుకుని మళ్ళీ కొత్తదానిలాగా వాడుకోవచ్చని సూచించింది. ఐతే పల్లెల్లో ఉచితంగా దొరికే వస్తువు ఆన్ లైన్లోకి ఎక్కేసరికి దాని ధర వేల రూపాయలకు పెరిగిపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో కూడా వేపపుల్లలను ఆన్ లైన్ లో ఎక్కువ ధరకు అమ్మడంపై చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
This is the same ‘dattun’ used by people in our villages now sold in US supermarkets for $15 as ‘organic toothbrush’. #marketing pic.twitter.com/zLKsk1p5Id
— Harsh Goenka (@hvgoenka) September 17, 2020