ఏపీ రాజకీయం: ఒకరిది అజ్ఞానం – మరొకరిది అర్థజ్ఞానం!

-

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అర్థజ్ఞానం – అజ్ఞానం పేరుకుపోయింది. మాట్లాడే మాటల్లో నైతికత, ఇంగితం కొరవడుతుంది. ఈ విషయంలో అధికారపక్షం, ప్రతిపక్షం అనే తారతమ్యాలేమీ లేవు. అధికారపక్షం తామింకా ప్రతిపక్షంలోనే ఉన్నామనే ఆలోచనలతో ముందుకుపోతుంటే… ప్రతిపక్షమేమో, తామింకా అధికారపక్షంలోనే ఉన్నామన్న భ్రమల్లో బ్రతుకుతుంది! ఫలితంగా… ప్రజలకు ఉపయోగపడాల్సిన వారి పోరాటాలు కాస్త వారి వారి వ్యక్తిగత మనుగడలను కాపాడుకోవడానికి ఉపయోగపడుతున్నాయి!

jogi ramesh ayyanna patrudu

విశాఖ జిల్లా నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు… గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో శాసనసభ మాజీ స్పీకర్‌ దివంగత కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మైకందుకుని చెలరేగిపోయారు. అంతర్గతంగా ఉన్న అసహనమో.. అంతర్లీనంగా ఉన్న అజ్ఞానమో.. విజ్ఞత మరిచిన సంస్కారమో… కారణం ఏదైనా శృతితప్పారు. ముఖ్యమంత్రిపైనా, అధికారులపైనా… “నా కొ..” అంటూ మాట్లాడారు. నిస్సుగ్గుగా ఆ వ్యాఖ్యలను సమర్ధించుకునే పనికి పూనుకున్నారు. అది అయ్యన్న పరిపూర్ణ అజ్ఞానం!

దీంతో…  వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ రోడ్డెక్కారు. తమ అధినేతను అంతమాట అంటారా అంటు… పెద్ద ఎత్తున కార్యకర్తలు కర్రలు జెండాలతో చంద్రబాబు ఇంటిని ముట్టడించారు. బాబును క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జరగాల్సిన రచ్చ అంతా జరిగిపోయింది. దీంతో… అధికారపక్షంలో ఉన్న జోగి రమేష్… అయ్యన్న వ్యాఖ్యలపై స్పందించాల్సిన తీరిది కాదేమో అన్న కామెంట్లు మొదలైపోయాయి! అయ్యన్న మెడలు వంచాలంటే… నోరు అదుపులోపెట్టుకునేలా చేయాలంటే… అధికారపక్షానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లీగల్ గా కూడా ప్రొసీడ్ అవ్వొచ్చు! కానీ.. ప్రజాస్వామ్యం మాటున ప్రతిపక్ష లక్షణాలు పోలేదో ఏమో కానీ… ఇలా రంగంలోకి దిగారు. ఏమిసాధించారు?

ఇక్కడ ఇరు పక్షాలు గ్రహించాల్సింది ఒకటే అని విశ్లేషకులు చెబుతున్న మాటలు ఇలా ఉన్నాయి! విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రంలొని ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తున్నప్పుడు.. అంత దారుణం జరగబోతున్నప్పుడు.. బీజేపీ నేతల ఇళ్లను, విశాఖలో దిగిన బీజేపీ నాయకుల ఇళ్లను ముట్టడించడంలో ఈ ఉత్సాహం ఏమైందనేది వారి ప్రశ్నగా ఉంది! రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో… కేంద్రాన్ని మెడలు వంచలేని పరిస్థితుల్లో ఉన్న ఈ ఇరుపార్టీల నేతలు… వీరికి వీరు జుట్టూ జుట్టూ పట్టుకోవడం వల్ల ఒరిగేదేమిటన్న ప్రశ్నలూ మొదలవుతున్నాయి!

ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేఖ విధానాలపై సరైన సమయంలో, సరైన విధంగా పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ నేతలు… ఇలా రోడ్లెక్కి మైకుల ముందు విజ్ఞత మరిచి మాట్లాడటం వల్ల… పార్టీకి, ఇటు ప్రజలకు ఒరిగేదేమిటో, కలిగే ప్రయోజనం ఏమిటో.. వారు ఆలోచించుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు! ఫలితంగా పార్టీని – పార్టీ నేతలనూ కాస్త కంట్రోల్ లో పెట్టుకోవాల్సిన బాధ్యత బాబుపై పుష్కలంగా ఉందని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news