అవి సార్వత్రిక ఎన్నికలు అయినా.. స్థానిక ఎన్నికలు అయినా.. తిరుపతిలో జరిగిన బై ఎలక్షన్స్ అయినా.. పరిషత్ పోరు అయినా… పవన్ కల్యాణ్ నేరుగా పోటీ చేసినా.. బీజేపీ వంటి పార్టీలకు ప్రచారం చేసినా.. ఫలితం మాత్రం సేం టు సేం అన్నట్లుగా ఉంటుంది! సినిమా బాక్సాఫీసుని తనదైన శైలిలో రికార్డులు బద్దలు కొట్టే పవన్.. బ్యాలెట్ బాక్స్ దగ్గర మాత్రం డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితికి ఎందుకు పడిపోతున్నారు? నాయకుడితో పాటు కార్యకర్తలు సైతం ఒక అవగాహనకు రావాల్సిన సమయం ఇది!
ప్రపంచంలో యువకులు అత్యధికంగా ఉన్న దేశం ఇది. రాజకీయంగా కొత్తతరం నాయకులకు ఎంతో అవకాశం ఉన్న సమయం ఇది. ఇలాంటి సమయంలో కూడా.. సినిమాలతో యువకులను విపరీతంగా ఆకర్షించడంలో సక్సెస్ అయిన పవన్.. ఎన్నికల విషయానికొచ్చేసరికి నాయకుడిగా ఎందుకు ఎన్నిక కాలేకపోతున్నారు? అనేది ఆలోచించుకోవాల్సిన సమయం ఇది! పరిషత్ ఎన్నికల ఫలితాలిచ్చిన సపోర్ట్ తో ఆ బలాన్ని మరింత పెంచుకుంటూ నిలుపుకోవాల్సిన సమయం ఇది!
ఇవన్నీ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా.. ఎలా చెప్పుకున్నా.. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో జనసేన ఫెయిల్ అవ్వడానికి కారణాల్లో మాత్రం.. నాయకుడు, కార్యకర్తల పాళ్లు చెరిసగం అనే చెప్పుకోవాలి. “తిలా పాపం తలా పిడికెడు” అన్నమాట!
ఈ విషయంలో “నాయకుడు – కార్యకర్తలకు” కొన్ని ఉపయోగపడే సూచనలు చేస్తున్నారు విశ్లేషకులు!
తాను “పట్టుకున్న కుందేలుకి మూడేకాళ్లు” అన్న పంథాను పవన్ వీడాలనేది వారు చెబుతున్న ప్రథమ అంశంగా ఉంది.
ఇదే సమయంలో “కలుపుకుపోయే విషయంలో చాలా వెనుకబడిపోతున్నారనేది” కూడా మరో ప్రధాన అంశంగా ఉంది.
“ఏపీలో అధికారపార్టీకి సరైన ప్రత్యామ్నాయం లేదు” అనే కామెంట్లు వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో పవన్.. ‘తాను పరిపూర్ణంగా విఫలమవుతున్న’ విషయాన్ని గ్రహించుకోవాలి!
తాను “టీడీపీ తానులో ముక్క కాదని, బీజేపీ చంకనెక్కిన బిడ్డ కానే కాదదు” అనే సంకేతాలు ప్రజల్లోకి పంపాలి. అలానే నడుచుకోవాలి. పార్టీ పెట్టిన కొత్తలో చెప్పిన “మాట”కు పూర్తిగా కట్టుబడి ఉండాలి!
అన్నింటికంటే ముందు.. తాను పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిని అని, తనకు “రాజకీయాలపై అవగాహన కాదు, ప్రజాసేవపై పరిపూర్ణ పరిజ్ఞానం ఉంది” అనే విషయాన్ని.. కనీసం తమ కార్యకర్తలకు అయినా అర్థమయ్యేలా చెప్పుకోవాలి.
తనకు సినిమా, రాజకీయం రెండూ రెండు కళ్లు అనే మాట కాకుండా.. తనకు “ప్రజాసేవ తర్వాతే సినిమా సంతోషం” అని సంకేతాలివ్వాలి.
ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు.. “ప్రజల తరుపున తొలి గొంతుక నేనవుతా” అనే సంకేతాలు పుష్కలంగా ఇవ్వాలి.
పుష్కరాలకోసారి ప్రజల్లోకి రాకుండా.. సినిమాలు చేసుకుంటున్నా కూడా “నిత్యం ఎంతో కొంత సమయం ప్రజలకు, ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు” కేటాయించుకోవాలి.
ఇక కార్యకర్తల విషయానికొస్తే..
ఒంటెద్దుపోకడలకు పోకుండా.. ఇది “మా పార్టీ” అనే మాటలకు బదులు.. ఇది “మనపార్టీ” అనే మాట మిగిలిన వర్గాలతో మాట్లాడే నేర్పు కలిగి ఉండాలి.
బీసీ రిజర్వేషన్ కావాలని పోరాడే కాపు సామాజికవర్గ ప్రజలు.. తాము కూడా వెనుకబడిన సామాజిక వర్గమే అని ప్రభుత్వాలకు చెప్పుకునే ప్రజలు.. ఆ విషయాన్ని చేతల్లోనూ, ఇతర సామాజికవర్గ ప్రజలతో ప్రవర్తించే విషయంలోనూ గుర్తుంచుకోవాలి.
“పోరాడితే పోయేదేమీలేదు – బానిస సంకెళ్లు తప్ప” అనే మాట స్థానంలో… “కలిసి పోరాడితే పోయేదేమీ లేదు – బహుజనుల కోరిక నెరవేరడం తప్ప” అని గ్రహించుకోవాలి. తాము కూడా బహుజనుల్లో ఒకరిమి కావాలని తపించాలి, కలుపుకుపోవాలి, కలిసిపోవాలి.
రాజకీయం అంటే.. అది అల్లరితో కూడిన ఆటపాటల వ్యవహారం కాదు. అదొక యజ్ఞం అని.. ప్రజామెప్పు పొందడం అని.. తమ నాయకుడిపైనే కాదు, తమపై కూడా ప్రజలకు నమ్మకం కలిగించి ముందుకుపోవడం అని తెలుసుకోవాలి!
వీటన్నింటి విషయాల్లో జనసేన నాయకుడు, కార్యకర్తలు ఒక అవగాహనకు వస్తే.. కచ్చితంగా ప్రతిఫలం ఉంటుందనేది విశ్లేషకుల మాటగా ఉంది!