వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టిడిపి అధినేత చందబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నేషనల్ స్కామర్సుకు కన్సల్టెంటు చంద్రబాబు అని…ఆయనను ఎక్కడ తడిమినా అనేక కుంభకోణాలు బయటపడతాయని ఆరోపించారు. చంద్రబాబు కుటుంబం డ్రగ్స్ బిజినెస్సులోకి దిగిందేమోననే అనుమానం వస్తోందని ఎద్దేవా చేశారు. పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుబడిన ఈ సందర్భంలో లోకేష్ ఎక్కడున్నారు..? లోకేష్ దుబాయిలో ఉన్నారని మాకు సమాచారం ఉందని చురకలు అంటించారు సజ్జల.
తమ డబ్బులను విదేశాల్లో దాచిన చరిత్ర చంద్రబాబు కుటుంబానిదని.. దీని పై దర్యాప్తు సంస్థలు అసలు నిజాలు బయటపెట్టాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. తమ వ్యవహరం బయటకి రాకుండా ఉండేందుకే టీడీపీ నేతలు వైసీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ప్రపంచంలో ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వానికి.. వైసీపీకి లింక్ పెడుతూ ప్రతిపక్షం ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరాయిన్ విషయంలో రాష్ట్రానికేం సంబంధం లేకున్నా.. అదే పనిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు సజ్జల. ఇదే సందర్భంలో అదానీ మీద పడ్డారని.. సుధాకర్ అనే వాడి పేరు పట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. రాజమౌళి, బోయపాటిలు వీళ్లతో ఉన్నారో.. లేక తెలుగుదేశం వాళ్లే డైరెక్టర్లుగా మారారో అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. విజయసాయి రెడ్డి.. ద్వారంపూడి పేర్లను అనవసరంగా ప్రస్తావించారన్నారు.